సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ

Jan 4,2024 22:01

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం నాటికి 16 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన శిబిరం నుంచి అర్‌అండ్‌ బి అతిధి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు తమ పట్ల బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ప్రధానంగా ఎస్‌పిడి అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. తాము హక్కుల కోసం పోరాడుతున్నామని, బెదిరిస్తే భయపడేది లేదని అన్నారు. మహిళా ఉద్యోగులు పట్ల ఎస్‌పిడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శుక్రవారం చలో విజయవాడకు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గురువులు, శ్రీనివాసరావు ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️