సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకే..!

Dec 15,2023 21:47
ముగిసిన ఆశాల 36 గంటల ధర్నా

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకే..!ముగిసిన ఆశాల 36 గంటల ధర్నాప్రజాశక్తి – తిరుపతి సిటిఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని, సమస్యలు పరిష్కరించకుంటే ఉధతమైన ఆందోళనకు సన్నద్ధం కావాల్సి ఉంటుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. ఆశా వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తిరుపతిలోని డిఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద 36 గంటల పాటు ధర్నాను నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ధర్నా విరమణ సందర్భంగా వందలాదిమంది ఆశా వర్కర్ల నుద్దేశించి కందారపు మురళి ప్రసంగించారు. 36 గంటల ధర్నాతో యావత్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, డిఎంహెచ్‌ఓ కార్యాలయాలు దిగ్బంధనమయ్యాయని, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్రంలో అంగన్వాడీల తరహా లోనే ఆశా వర్కర్లు సమ్మెకు సన్నద్ధం కావాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లు సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఆశా వర్కర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తూ, ఐదు సంవత్సరాలపాటు ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికి నెలకు మూడు లక్షల రూపాయల వేతనం ఇవ్వటం, పదవీ విరమణ తర్వాత నెలకు 50 వేల నుంచి 75వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వటం ఏ రకంగా సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. తమ జీవిత చరమాంకం వరకు సామాజిక ఆరోగ్యం కాపాడటానికి తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టిన ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా నిరసించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు ఆర్‌ లక్ష్మి, మునిరాజా, మురళి, గంగులప్ప, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

➡️