సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు?

ప్రజాశక్తి-దొనకొండ: ప్రజల సమస్యలు పరిష్కరించని మండల సమావేశాలు ఎందుకంటూ అధికార పార్టీకి చెందిన సభ్యులు సమావేశంలో వాపోయారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఉషారాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరిధిలో ప్రభుత్వ పథకాల గూర్చి వివరించారు. చిన్న చిన్న సమస్యలు కూడా.. ఈ సందర్భంగా దొనకొండ ఎంపీటీసీ సభ్యురాలు గుంటు అమ్మాజీ మాట్లాడుతూ తమ పరిధిలో చిన్న చిన్న సమస్యలు సయితం పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల బెడద వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నివారించాలని కోరారు. బ్రహ్మారావుపేటలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయం తెలిపినా పట్టించుకోవటం లేదని, కనీసం వీధిలైట్లు కూడా వేయించుకోలేని పరిస్థితుల్లో తాము ఉన్నామని వాపోయారు. అందుకు దొనకొండ సర్పంచ్‌ గ్రేస్‌రత్నకుమారి స్పందించి బ్రహ్మారావుపేటలో కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్య కారణంగా వీధిలైట్ల సమస్య ఏర్పడిందని అన్నారు. కోతుల నివారణపై ఉన్నతాధికారు లతో చర్చిస్తున్నామని త్వరలో అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని అన్నారు. సంగాపురం సర్పంచ్‌ భీమనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమావేశాల్లో చర్చించిన కొన్ని సమస్యలు పరిష్కారం కావటంలేదని, దీంతో సమావేశాల కు వెళ్లినా ప్రయోజనం లేదని పలువురు ప్రజాప్రతినిధులు డీలా పడ్డారన్నారు. గ్రామాల్లో తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే కోరిక నెరవేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సువర్ణ, ఎంపీడీఓ వసంతరావునాయక్‌, అధికారులు, ఎంపీటీసి సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

➡️