సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

Feb 25,2024 20:24

ప్రజాశక్తి- నెల్లిమర్ల : మిమ్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరశన సమ్మె ఆదివారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ 2003 నుంచి ఉద్యోగులంతా హాస్పిటల్‌ అభివృద్ధిలో కీలకపాత్ర వహించి కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాలను, పిల్లలను వదిలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర వహించారన్నారు. అటువంటి ఉద్యోగులకు వేతన ఒప్పందం చేయ కుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గ మన్నారు. వెంటనే ఈ నిర్లక్ష్యం వదిలి యూనియన్‌తో చర్చించి వేతన ఒప్పందం చేసి, బకాయి ఉన్న 7 డిఎలను ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, జనవరి నెల జీతం వెంటనే వేయాలని డిమాండ్‌ చేశారు. చిన్న చిన్న కారణాలు చూపి వసూలు చేసిన జరిమానాలను వెంటనే రికవరీ చేసి అకౌంట్‌లోకి వేయాలని, సస్పెండ్‌ చేసిన కామునాయుడును, అప్పలనాయుడులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లింపల్లి రామారావు, మిమ్స్‌ యూనియన్‌ నాయకులు నారాయణ రావు, బంగారునాయుడు, రాంబాబు, మధు, కామునాయుడు, గౌరీ, వరలక్ష్మి, వంశి, నాగభూషణం, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️