సమస్యల పరిష్కారానికి టీచర్ల వినతి

Dec 23,2023 21:47
ఫొటో : ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న టీచర్లు

ఫొటో : ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న టీచర్లు
సమస్యల పరిష్కారానికి టీచర్ల వినతి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆత్మకూరు, ఎఎస్‌పేట, అనంతసాగరం, మర్రిపాడు మండలాల యుటిఎఫ్‌ శాఖల ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డిని కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎంఎల్‌ఎకు విన్నవించారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, అలా చెల్లించని కారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు బ్యాంకు లోన్లు మొదలైన వాయిదాలు సకాలంలో చెల్లించలేక పెనాల్టీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలియజేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలపై జరిగిన 2023 ఆగస్టు 24న జరిగిన ఉద్యోగుల జాయింట్‌ స్టాఫ్‌ మీటింగ్‌లో పిఆర్‌సి, దాని ముందు డిఎ అరియర్లు జనవరి 2024 నుండి 12 వాయిదాలలో చెల్లిస్తామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్లో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇప్పటివరకు అవి చెల్లించలేదని తెలియజేశారు. పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐలు సరెండర్‌ లీవులు నెలనెలా క్రమం తప్పకుండా చెల్లిస్తామని చెప్పి నాలుగు నెలలు గడిచినప్పటికీ బకాయిలు చెల్లించలేదని తెలియజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సుమారు రూ.11,462 కోట్ల బకాయిలను విడుదల చేసి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఎంఎల్‌ఎ హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.గంగాధరం, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు బి.శివప్రసాద్‌, ఆత్మకూరు, ఎఎస్‌పేట, మర్రిపాడు, అనంతసాగరం, మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️