సమస్యల పరిష్కారానికే స్పందన : జేసీ

ప్రజాశక్తి-పెద్దదోర్నాల ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె. శ్రీనివాసులు తెలిపారు. పెద్దదోర్నాలలోని బొగ్గరపు వారి కల్యాణ మండపంలో శుక్రవారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలకు అనేక వ్యయ ప్రయాసాలకోర్చి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రానవసరం లేదన్నారు. తామే ఇక్కడికి వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్ధాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మండల స్ధాయిలోనే సమస్యలను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలని, తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పునరావాస ప్యాకెజీ కల్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. మొత్తం 320 మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, తహశీల్దారు వేణుగోపాల్‌, ఎంపిడిఒ నాసర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️