సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌

ప్రజాశక్తి-రంపచోడవరం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పరిధిలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల యూనియన్‌ మహాసభ గురువారం మండల కేంద్రంలో జరిగింది. గిరిజన సంకేమ హాస్టళ్లలో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు కొత్తగా 289 మంది సీఐటీయూలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన మహాసభలో వెంకట్‌ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు శ్రమటోర్చి భోజనాలు వండి పెడుతున్నారని, కాని కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు శ్రమను ప్రభుత్వం, ఐటిడిఎ దోసుకుంటున్నారని విమర్శించారు. 60 ఏళ్ల పాటు సేవలు అందించినప్పటికీ చాలీచాలని జీతాలతో పాటుగా రిటైర్మెంట్‌ అయ్యేటప్పుడు కనీసం ఎటువంటి బెనిఫిట్స్‌ ఉండటం లేదన్నారు. సీనియారిటీ ప్రకారం రెగ్యులర్‌ చేయాల్సిన ప్రభుత్వం ఆప్కాస్‌లో కలిపి, రెగ్యులర్‌ అయ్యే గైడ్‌లైన్సు లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వర్కర్లకు ఇచ్చే వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఉదయం 4గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోజులో దాదాపు 15 గంటల పాటు పని చేస్తున్న వీరికి కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనీస వేతనాలు రూ.26000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని, విధుల్లో చనిపోయిన కార్మికుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మెడికల్‌ సెలవులు, ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కమిటీ ఎన్నిక ఈ మహాసభలో 25 మందితో కమిటీని, 11మందితో ఆపీస్‌ బేరర్స్‌ను ఎన్నుకోవడం జరిగింది. యూనియన్‌ గౌరవాధ్యక్షులుగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌, అధ్యక్షులుగా సోడి దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా కారం శ్రీనుబాబు, కోశాధికారిగా గిరిబాబు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎమ్‌.వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షుడు కె.శాంతిరాజు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ.సిరిమల్లిరెడ్డి, వర్కర్లు వీరయ్య, చంద్రమ్మ, పుల్లమ్మ, నాగేశ్వరరావు. వెంకటేశ్వర్లు, చిన్నిబాబు, కుమారి, బాలమ్మ, రమాదేవి, తిరుపతమ్మ, వెంకన్న, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️