సమ్మె ఒప్పందాలను అమలుచేయాలని ధర్నా

ప్రజాశక్తి-యంత్రాంగం మున్సిపల్‌ కార్మికులు 16 రోజుల పాటు సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ జోనల్‌ కార్యాలయాల వద్ద కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంచరపాలెం : జ్ఞానాపురంలోని జోన్‌-5 కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జోన్‌ కార్యదర్శి ఒ.అప్పారావు మాట్లాడుతూ, 16 రోజుల సమ్మె అనంతరం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని ఇప్పటికీ అమలు చెయ్యకపోవడం దారుణమన్నారు. రూ.21 వేలు కనీస వేతనం ఇచ్చేలా, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా జిఒ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జోన్‌ అధ్యక్షులు వి.మహేశ్వరి, సిఐటియు నాయకులు యుఎస్‌ఎన్‌.రాజు, జి.శ్రీను, మున్సిపల్‌ నాయకులు పి.రాజు, వై.నూకరాజు, సత్యవతి, బి.రమణ, దుర్గారావు, కొండమ్మ, వినోద్‌, వేలంగిరావు, శివ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఎం పాలెం : ఎపి మున్సిపల్‌ అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యాన జివిఎంసి మధురవాడ జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ ఉప ప్రధాన కార్యదర్శి ఎంవి ప్రసాద్‌, సిఐటియు జోన్‌ అధ్యక్షులు డి.కొండమ్మ మాట్లాడుతూ, సమ్మె కాలంలో జరిపిన చర్చలకు సంబంధించిన హామీలను నేటికీ అమలుచేయకపోవడం దారుణమన్నారు. చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు జిఒ విడుదల చేయాలని, లేకుంటే మళ్లీ సమ్మెలోకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ ఉపాధ్యక్షులు డి.అప్పలరాజు, సిహెచ్‌.శేషుబాబు, కె.నాగరాజు, వి.నర్సియ్యమ్మ, బి.శుభ, డి.సూరిబాబు, బి.నర్సింగరావు, కె.కొండమ్మ, మేరీ అమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

➡️