సమ్మె శిబిరాల్లో లబ్ధిదార్లు, పిల్లలు

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అంగన్వాడీలకు సంఘీభావంగా సమ్మె శిబిరంలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న లబ్ధిదార్లు
ప్రజాశక్తి – వినుకొండ : పట్టణంలోని సురేష్‌ మహల్‌ రోడ్డులో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె శిబిరం ఆరో రోజైన ఆదివారమూ కొనసాగింది. అంగన్వాడీ కేంద్రాలకెళ్లే పిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతలు సమ్మెకు సంఘీభావంగా శిబిరంలో పాల్గొని మోకాళ్లపై నిరసన తెలిపారు. నాయకులు లక్ష్మీప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులు గాయత్రి, కమల, బిబి తదితరులు మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు చాలా బాగా సెంటర్లను నిర్వహిస్తున్నారని, తమ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని అన్నారు. ఇంట్లో ఒక్క పిల్లను భరించటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పదుల సంఖ్యలో పిల్లల్ని ఒక్కదెబ్బ కూడా వేయకుండా చూసుకుంటున్నారని చెప్పారు. మంచి భోజనం పెడుతూ తమ పిల్లల ఆలనాపాలనా బాగా చూసుకుంటున్నారని, అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. సమ్మె శిబిరాన్ని సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, పట్టణ కార్యదర్శి ఎ.ఆంజనేయులు, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు కొండయ్య మాస్టర్‌ సందర్శించి మద్దతు తెలిపారు. నాయకులు నాగజ్యోతి, డి.బీబులు, శ్రీదేవి, జి.పద్మ, గాయత్రి, నిర్మల, సారమ్మ, మున్ని, ఉమాశంకరి, రేవతి, హారతి, కృష్ణకుమారి పాల్గొన్నారు.
 
ప్రజాశక్తి – మంగళగిరి :

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను తీవ్రతరం అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని వారు ఆదివారం సందర్శించి మద్దతుగా మాట్లాడారు. అంగన్వాడీల గురించి వైసిపి ఎమ్మెల్యేలు హేళనగా మాట్లాడుతున్నారని, ఇది తగని పనని అన్నారు. రూ.3 లక్షల వేతనాలు తీసుకునే ఎమ్మెల్యేలకు అత్తెసరు జీతాలతో పనిచేసే అంగన్వాడీల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించడం దారుణమన్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అంగన్వాడీల కార్యకర్తలతో అనేక రకాల పనులు చేపించుకుంటూ వేతనాలు పెంచాలంటే మాత్రం ప్రభుత్వానికి మనసు రావడం లేదని మండిపడ్డారు. మద్దతు తెలిపిన వారిలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, సిఐటియు నాయకులు జెవి రాఘవులు, రైతు సంఘం నాయకులు డి.వెంకట్‌ రెడ్డి, ఎం.పకీరయ్య, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.బాలాజీ, ఐద్వా నాయకురాలు జి.వీరబాయి ఉన్నారు.

ప్రజాశక్తి – తాడికొండ : నియోపకవర్గ కేంద్రమైన తాడికొండలోని సమ్మె శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు సందర్శించి మద్దతుగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలపై వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తోందని, ఇది అప్రజాస్వామిక చర్యని అన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి తమ పార్టీతోపాటు ఎఐటియుసి, సిఐటియు అండ ఉంటుందని చెప్పారు. మద్దతు తెలిపిన వారిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.శివాజీ, సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్‌.భాస్కరరావు ఉన్నారు.

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ :

కుంచనపల్లిలోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను అధికారులు పగలగొట్టడానికి వస్తున్నారని తెలిసి అడ్డుకునేందుకు సిపిఎం, టిడిపి, జనసేన నాయకులు కేంద్రాల వద్దకెళ్లారు. అయితే ఎవరూ రాలేదు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తుండగా మరోవైపు ప్రభుత్వం భయపెట్టేందుకు తాళాలు పగలగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. కేంద్రాలకు అద్దె బకాయిలు చెల్లించకుండా వాటిని అంగన్వాడీలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. టిడిపి మండల అధ్యక్షులు ఎ.సుబ్బారావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలు సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎ.రంగారావు, కె.వెంకటేశ్వరరావు, ఎ.రామారావు, ఎ.సుధాకర్‌, టిడిపి నాయకులు కె.మహేశ్వరరావు, జనసేన నాయకులు పి.అశోక్‌, గ్రామ అధ్యక్షులు ఎం.రాజా పాల్గొన్నారు.

ప్రజాశక్తి – తుళ్లూరు :
రాజధాని ప్రాంతం తుళ్లూరులోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని స్థానిక మదర్‌ థెరిస్సా ఆటో స్టాండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సందర్శించి మద్దతు తెలిపింది. యూనియన్‌ అధ్యక్షులు జె.నరేంద్ర, పి.నాగమల్లేశ్వరరావు, మరికొంత మంది సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు కరిమూన్‌, సిపిఎం శాఖా కార్యదర్శి పి.బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మానుకుని సమస్యల పరిష్కరించాలని కోరారు.

ప్రజాశక్తి – దుగ్గిరాల :
తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకూ సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన దుగ్గిరాలలోని సమ్మె శిబిరాన్ని సిఐటియు మండల ఉపాధ్యక్షులు జె.బాలరాజు సందర్శించి మద్దతుగా మాట్లాడారు. సచివాలయ వాలంటీర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదుని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.జయ, సిహెచ్‌.నాగమణి, మీనా, వెంకటేశ్వరమ్మ, సునీత, రాజకుమారి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – కొల్లిపర : స్థానిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మోకాళ్లపై నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్‌ మండల అధ్యక్షులు జి.నిర్మల జ్యోతి, యు.స్వర్ణలత, కృష్ణవేణి, లక్ష్మి, శివపార్వతి, శ్రీదేవి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట :

పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో అంగన్వాడీలు లబ్ధిదార్లతో మాట్లాడారు. తమ సమస్యలను వివరించడంతోపాటు సమ్మె నేపథ్యాన్ని వివరించి మద్దతు కూడగట్టారు.

ప్రజాశక్తి – తెనాలి రూరల్‌ :
స్థానిక విఎస్సార్‌ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరం కొనసాగింది. కొలకలూరు సమ్మె శిబిరంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలుగొట్టేందుకు యత్నించిన ఐసిడిఎస్‌ అధికారులను టిడిపి, జనసేన నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వం దిగివచ్చేంతవరకు సెంటర్లను తీయభోమని తలుపులకు అడ్డంగా బైఠాయించారు. సమ్మె శిబిరాల్లో సిఐటియు జిల్లా నాయకులు కె.బాబూప్రసాద్‌ మాట్లాడుతూ అంబేధ్కర్‌ ఆలోచనలకు విరుద్ధంగా పాలన కొనసాగుంతోందన్నారు. 1972లో పార్లమెంటు చేసిన పేమెంట్‌ ఆఫ్‌ గ్రాట్యుటి చట్టాన్ని అంగన్వాడీలకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. వారి ఉద్యోగ పరిస్థితులు మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకొని 21నెలలు గడుస్తున్నా సరైన స్పందన లేని నేపథ్యంలో సమ్మె చేపట్టినట్లు వివరించారు. 47వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌లో తీసుకున్న నిర్ణయాలు పదేళ్లయినా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. సమ్మెలో జె.అనురాధ, పి.పావని, పి.విజయలక్ష్మి, ఎ.అంజనికుమారి, జె.రంగపుష్ప, కళాధరి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల :

సమ్మెలో భాగంగా అంగన్వాడీలు తమ కేంద్రాల వద్ద, అంబేద్కర్‌ సెంటర్లో నిరసన తెలిపారు. నాయకులు ఉష, శివకుమారి, ఇందిరా, కోటేశ్వరి పాల్గొన్నారు.

ప్రజాశక్తి – పెదనందిపాడు : అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని పిల్లలు, లబ్ధిదారులు సందర్శించి శిబిరంలో కూర్చుని సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, శివపార్వతి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️