సర్పంచుల గృహనిర్బంధం సర్కారీ పిరికిపంద చర్య

Feb 6,2024 14:46 #Dharna, #East Godavari, #sarpanches

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు-గోదావరి) :సర్పంచుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు, వారికి సమాధానం చెప్పలేక గృహ నిర్బంధం విధించడం సర్కారీ పిరికిపంద చర్యని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కరుటూరి నరేంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం మంగళవారం చలో అసెంబ్లీ పిలుపుమేరకు, పాల్గొనేందుకు వెళ్లకుండా సర్పంచ్ లను గృహనిర్బంధం చేసిన సందర్భంగా తాడిపర్రు సర్పంచ్ నరేంద్రబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన గ్రామ స్వరాజ్యం నా ధ్యేయమన్న మాటలను తుంగలో తొక్కి, ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పాలన కరోనా మచ్చ లాంటిదన్నారు. సర్పంచుల న్యాయపరమైన పదహారు డిమాండ్లను తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు. ఉండ్రాజవరం మండలం సర్పంచ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు, కే సావరం సర్పంచ్ ఎన్ రామకృష్ణ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్పంచులకు సంక్రమించిన అధికారాలను కాలదన్నేలా సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేయడం ప్రభుత్వ దుర్బుద్ధిని బహిర్గత పరుస్తుందన్నారు.

➡️