సాగర్‌ నీటి వినియోగంలో పొదుపు : కలెక్టర్‌

Mar 27,2024 18:54

అధికారులతో సమీక్షిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నాగార్జున సాగర్‌ జలాశయంలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. ఈ అంశమై సంబంధిత అధికారులతో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ బుధవారం సమీక్షించారు. నీటి సరఫరాలపై గ్రామాల్లో నిత్యం పర్యవేక్షించాలని, అవసరాలకు అనుగుణంగానే సరఫరా చేయాలని చెప్పారు. వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్‌ కార్యనిర్వహణ అధికారి, మండల అధికారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖాధికార్లతో సమన్వయ సమావేశం నిర్వహించి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల వారీగా నీటి సమస్యలు అధిగమించుటకు తీసుకోవాల్సిన చర్యలను రూపొందించాలన్నారు. ఇదిలా ఉండగా సాగర్‌ జలాశయం మొత్తం నీటి మట్ట 590 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 513 అడుగుల వద్ద ఉందని, డెడ్‌ స్టోరేజీ 510 అడుగులని అధికారులు వివరించారు. ప్రస్తుతం 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు. సమీక్షలో గ్రామీణ నీటి సరఫరాధికారి సురేష్‌, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఇ వరలక్ష్మి, విద్యుత్‌ శాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️