సాగుభూములకు పట్టాలివ్వాలి

Jan 2,2024 22:05

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : గిరిజనుల సాగులో ఉన్న అటవీ బంజరు అన్‌సర్వేడ్‌ భూములను సర్వే చేసి పట్టాలివ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం గిరిజనులు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వంతల సుందర్రావు, గెమ్మెల జానకీరావు మాట్లాడుతూ గతంలో గిరిజనులకు పట్టాలు ఇవ్వడానికి అధికారులు సర్వేలు చేశారని, అయితే నేటికీ పట్టాలు పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు. అరకొర పట్టాలు పంపిణీ చేశారన్నారు. ఒకే రెవెన్యూ పరిధిలో సాగు చేస్తున్న గిరిజనులందరికీ సర్వేలు చేసి అందులో కొంతమందికి పట్టాచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గిరిజన రైతుల మధ్య తగాదాలు పెట్టేలా రెవెన్యూ అధికారులు చేస్తున్నారన్నారు. గిరిజన రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారని, ఇది ఎంతకాలం కొనసాగదని హెచ్చరించారు. గతంలో సర్వేలు జరిపి వచ్చిన పట్టాలను ఇప్పటి వరకు అధికారులు తమ చేతిలో ఉంచుకొని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వచ్చిన పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. గతంలో సర్వే చేసిన వారందరికీ అటవీ, బంజరు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు కూనేటి చినబాబు, మర్రి మసి, వంశీ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తాడంగి గాసి, సభ్యులు సిద్ధ సాయిబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️