సిఐ, ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ప్రజాశక్తి- ఒంగోలుకలెక్టరేట్‌ : విచారణ పేరుతో యర్రగొండపాలెంలో నాగెపోగు మోజేష్‌ పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించిన సిఐ, ఎస్‌ఐపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురామ్‌ కోరారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రఘురామ్‌ మాట్లాడారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి తరచూ అమాయకులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సంబంధం లేని కేసులో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి తనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన మోజేష్‌ పెట్రోలు పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారకులైన ఎస్‌ఐ, సిఐలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. విచారణ పేరుతో స్టేషన్లకు పిలిపించి కులం పేరుతో, అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నారని, అడిగితే విచక్షణారహితంగా హింసిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు వి.మోజేస్‌, అత్తంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️