సిటిఆర్‌ఐ ప్లాటినం ఉత్సవాలు ప్రారంభం

Dec 13,2023 22:45 #సిటిఆర్‌ఐ
సిటిఆర్‌ఐ ప్లాటినం ఉత్సవాలు ప్రారంభం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్‌ఐ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన ప్రతిష్టాత్మక సిటిఆర్‌ఐ స్థాపించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సిటిఆర్‌ఐ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఈ ఉత్సవాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత వ్యవసాయ పరిశోధన మండలి విత్తన వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డికె.యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో చిన్న పరిశోధన కేంద్రంగా గుంటూరులో ప్రారంభమై క్రమంగా ఎదిగి దేశంలోనే పొగాకు పంటకు ఏకైక ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థగా అవతరించిందన్నారు. పంటల సాగులో రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు తప్పనిసరి అన్నారు. దీనితోపాటు మేలైన యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. ఇటీవల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని దీనివల్ల రైతులకు అపార నష్టం సంభవిస్తుందన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను రూపొందించడానికి శాస్త్రవేత్తలు కషి చేయాలన్నారు. పొగాకు పంట అధిక శ్రమతో కూడుకున్నదని, కూలీలకు శ్రమ తగ్గించడానికి యాంత్రీకరణను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. పొగాకు పంట నుంచి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు ప్రోత్సహించాలని, ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులకు అందించాలన్నారు. మన దేశం నుండి ఎగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తుల్లో పొగాకు పంటకు ప్రాధాన్యముందన్నారు. పొగాకు పంట నుంచి ప్రత్యామ్నాయ ఉత్పత్తులైన నూనె, కాన్సెర్‌ కారకాలను తగ్గించడానికి పరిశోధనలు చేయాలన్నారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ నాణ్యమైన పొగాకుకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. మన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పొగాకు పంటలో అధిక దిగుబడి నిచ్చే నాణ్యమైన వంగడాల అభివృద్ధికి శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే పసుపు, మిరప లాంటి పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. పొగాకు, మిరప పంటల ఉప త్పత్తులకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. ఇటీవల సంభవించిన తుపాను వల్ల నష్టపోయిన పొగాకు రైతులను ఆదుకోవాలని పొగాకు బోర్డు చైర్మన్‌ యస్వంత్‌ కుమార్‌ను ఎంపీ భరత్‌రామ్‌ కోరారు. పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ మాట్లాడుతూ పొగాకు విశిష్టమైన పంట అని, ప్రపంచ వాణిజ్య పటంలో భారతదేశానికి చోటు లభించేలా పొగాకు రైతులను నిలపడంలో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ అద్భుతమైన కృషి చేసిందన్నారు. ఇక్కడి నేలలు వాతావరణం పొగాకు సాగుకు అత్యంత అనుకూలమైనవని, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన పొగాకు వంగడాలను రూపొందించాలని శాస్త్రవేత్తలను కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందడానికి పొగాకు పంట ఉపయోగపడుతుందన్నారు.ఈ ఉత్సవాల్లో రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడారు. నన్నయ వర్శిటీ విసి ప్రొఫెసర్‌ కె.పద్మరాజు మాట్లాడారు. సిటిఆర్‌ఐ సుదీర్ఘ ప్రస్థానానికి చిహ్నంగా నిర్మించిన ప్రత్యేక పైలాన్‌ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ఎంఎస్‌ స్వామినాథన్‌ అంతర్జాతీయ అతిథి గృహాన్ని ప్రారంభించారు. పొగాకు పంటకు సంబంధించి సంస్థ రూపొందించి విడుదల చేసిన వంగడాలతో కూడిన వివరాలు, మేలైన యాజమాన్య పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము, విత్తనం దగ్గర నుంచి పంట కోత వరకు, కోతానంతర పరిజ్ఞానానికి సంబంధించి వివరాలతో కూడిన ప్రదర్శన రైతులను విశేషంగా ఆకట్టుకుంది. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ మాగంటి శేషు మాధవ్‌ కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

➡️