సిట్టింగులకు తప్పని సెగ..!

Dec 17,2023 00:16
వ్యూహాలకు ముందుగానే

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

‘కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది. మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలి’ అని శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో మంత్రులకు సిఎం జగన్‌ పిలుపునిచ్చారు. ఎన్నికలు వేడి మొదలు కానున్న నేపథ్యంలో అధికార పార్టీ తన వ్యూహాలకు ముందుగానే పదును పెట్టింది. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. బలహీనపడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యర్థులను బలంగా ఢి కొట్టే నేతలను రంగంలోకి దింపి మరోసారి అధికారంలోకి రావడానికి ప్రణాలికలు సిద్ధం చేసుకుంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను నియమించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఎంపి స్థానాలతోపాటు, 4 స్థానాలు మినహా మిగిలిన 15 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. వైసిపి తన నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అమలు తప్ప సాధించిన అభివృద్ధి ఏమీ కనబడటం లేదని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల వ్యవధిలోనే 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. మళ్లీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకునే పనిలో అధికార పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసి గెలుపు కోసం కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జుల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా కొన్ని చోట్ల రేపో మాపో ఇన్‌ఛార్జుల నియామకాలు ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు గమనించిన అధిష్టానం ఆయన స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహాన్ని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ప్రత్తిపాడులో ఎంఎల్‌ఎ పర్వత ప్రసాద్‌ సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్న తరుణంలో ఇన్‌ఛార్జ్‌గా పర్వత జానకి దేవిని, సొంత క్యాడర్‌ను పక్కన పెట్టి నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులకు పదవులు ఇవ్వడం, సీనియర్లను కాదని కొన్ని పదవులను అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఠాపురం ఎంఎల్‌ఎ పెండెం దొరబాబును స్థానంలో ఇన్‌ఛార్జ్‌గా కాకినాడ ఎంపి వంగా గీతను అధిష్టానం నియమిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఎంఎల్‌ఎల్లో ఆందోళన ఎక్కువైంది. అధిష్ఠానాన్ని కలిసి తమ అభిప్రాయాలను చెప్పి ఎలాగైనా సీటు తమకే ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది.ఎంపిలు ముగ్గురూ అసెంబ్లీకే…ముగ్గురు ఎంపిలూ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికే పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాకినాడ ఎంపి స్థానానికి ఇప్పటికే పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్‌ను పోటీ చేయించాలని వైసిపి భావిస్తోంది. ప్రస్తుత ఎంపి వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్‌ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా కొవ్వూరుకు చెందిన పారిశ్రామిక వేత్తను రంగంలోకి దించుతారనే తెలుస్తోంది. అమలాపురం ఎంపి చింతా అనురాధ అమలాపురం లేదా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారని ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఈ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎంపి పండుల రవీంద్ర బాబును పోటీ చేయించే అవకాశం కనిపిస్తోందని పార్టీలో చర్చ సాగుతోంది. సిట్టింగ్‌ల్లో ఉత్కంఠకాకినాడ జిల్లా పరిధిలోని తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పెద్దాపురం స్థానాల్లో మాత్రమే క్లారిటీ కనిపిస్తుంది. మిగిలిన మూడు చోట్లా అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, మండపేట మినహా మిగిలిన చోట్ల టిక్కెట్లు మార్చే అవకాశం ఉంది. అమలాపురం ఎంఎల్‌ఎగా ఉన్న మంత్రి విశ్వరూప్‌పై సొంత సామాజిక వర్గంలోనే అసంతృప్తి కనిపిస్తుంది. దీంతో అతని తనయుడికి పాయకరావుపేటను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. వేణుకి శెట్టి బలిజ సామాజిక వర్గంలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రామచంద్రపురం టిక్కెట్‌ కాకుండా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీలో నిలపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఎంఎల్‌ఎ అభ్యర్థులుగా రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, చందన నాగేశ్వర్‌లకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపనుందని, ఇప్పటికే వారికి పార్టీ అధిష్టానం చెప్పకనే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజానగరం, అనపర్తి, నిడదవోలు నియోజకవర్గాల మినహా కొవ్వూరు, గోపాలపురం, రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో మార్పులు తప్పవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఎంఎల్‌ఎ టిక్కెట్లను ఆశిస్తున్న వారంతా వైసిపి రీజనల్‌ కో ఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డిని ఒప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

➡️