సిపిఎం, ప్రజా సంఘాలనేతలపై అక్రమ కేసులు కొట్టివేత

మంగళగిరి:  2015వ  సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, తాడేపల్లి పోలీసులు ఉండవల్లి సెంటర్లో రైతుల సమ స్యలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం , ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసు ను మంగళగిరి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రామకృష్ణ శుక్రవారం కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. సిపిఎం , ప్రజా సంఘాలకు చెందిన పదిమంది నేతలపై తాడేపల్లి పోలీసులు ఐపిసి 341 ,108 సెక్షన్ల క్రింద అక్రమ కేసును బనాయించారు. 2015 సంవత్సరం నుండి సిపిఎం నేతలు, ప్రజా సంఘాల నాయకులు మంగళగిరి కోర్టుకు 60 వాయిదాలకు హాజరయ్యారు. సిపిఎం నేతలపై పెట్టిన కేసు లో ప్రాసిక్యూషన్‌ వారు నేరాన్ని రుజువు చేయలేకపోవడంతో జడ్జి కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.ఈ కేసులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రాజధాని డివిజన్‌ సిపిఎం కార్యదర్శి ఎం.రవి, సిపిఎం తాడేపల్లి మండల రూరల్‌ కార్యదర్శి డి.వెంకటరెడ్డి, సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయ కులు ఎస్‌.కెఎర్రపీరు, గంగిరెడ్డి ఆంజనేయులు, దర్శ నపు విజరు, లంకా ఎల్లమంద చారి, రాజేంద్రప్రసాద్‌, ఎస్‌.కె రఫీ లపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.సిపిఎం, ప్రజాసంఘాల నేతల తరఫున ప్రముఖ న్యాయవాది కోక .వెంకటప్రసాద్‌ వాదించారు. ఈ కేసులో న్యాయ సహాయం అందించిన న్యాయవాది కోకా వెంకటప్రసాద్‌ కు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ ఉద్యమకారులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం, అంతకన్నా ఎక్కువగా ఉద్యమకారులపై కేసులు పెడుతూ, ప్రజా ఉద్యమాలను అణచి వేస్తుండటం దారుణమని అన్నారు.పాలకులకు ప్రజా ఉద్య మాలను అణిచివేయడం పరిపాటిగా మారిందని, ఉద్యమకారులను కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పి నట్లుగా ఉద్యమకారులపై పెట్టిన కేసులు అన్నిటిని ఎత్తి వేయాలని,ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ఆపి వేయాలని కోరారు.

➡️