సుజల స్రవంతి అలైన్‌మెంట్‌ మార్చకపోతే…. నష్టమే ఎక్కువ

Feb 1,2024 21:21

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్‌మెంట్‌ మార్పు చేయకపోతే ఆ ప్రాజెక్టుల వల్ల భూ నిర్వాసిత రైతులకు నష్టం జరగడంతోపాటు ప్రభుత్వానికి కూడా వ్యయ భారం పెరగనుంది. కాలువ మార్కింగ్‌ ఎగువ ప్రాంతం నుంచి కాకుండా లోతట్టు ప్రాంతం నుంచి చేసేందుకు నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కాలువ డిజైనింగ్‌ మార్పు చేయాలంటూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన నిర్వాసిత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి కాలువల నిర్మాణం చేపట్టడం ద్వారా లక్ష్యత సాగునీరు, తాగునీటికి ఇబ్బందేమీ ఉండబోదని సాంకేతిక నిపుణులు సైతం చెబుతున్నారు. అయినా ప్రభుత్వానికి పట్డకపోవడంతో రైతుసంఘం ఆధ్వర్యాన ప్రభుత్వంపై పోరాటానికి రైతాంగం సన్నద్ధమౌతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను సస్యమలం చేస్తామంటూ 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.7,214.10కోట్ల వ్యయంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 8లక్షల ఎకరాలకు సాగునీరు, 2.30లక్షల జనాభాకు రోజుకు 4.46టిఎంసిల తాగునీటితోపాటు మొత్తం సాగునీటిలో 1శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో అత్యధికంగా సుమారు 3.94లక్షల ఎకరాల మేర ఉమ్మడి విజయనగరం జిల్లాకు రావాల్సివుంటుంది. ఇందులో భాగంగా ఈ జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన కాలువల అలైన్‌మెంట్‌ వల్ల ఇప్పటికే సాగునీటి సదుపాయం ఉన్న సారవంతమైన భూములు ఎక్కువ మంది కోల్పోనున్నారు. ఇదే కాస్త ఎగువ ప్రాంతంలో తూర్పు కనుమలకు ఆనుకుని కాలువల లైనింగ్‌ రూపొందిస్తే రైతుల నుంచి సేకరించాల్సిన భూమి తగ్గుతుంది. లిఫ్ట్‌ల సంఖ్య 6నుంచి 4కు తగ్గడంతోపాటు, వాటి నిర్వహణ అయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని సాగునీటి రంగానికి చెందిన సీనియర్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు ఐఎస్‌ఎన్‌ రాజు తదితరుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాలువ అలైన్‌మెంట్‌ మార్పుచేయాలని ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు చాలా కాలంగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతునే ఉన్నారు. ఈ విషయమై సాగునీటి పారుదలశాఖ అధికారులు, ఆశాఖకు చెందిన రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబులతో ఎపి రైతు సంఘం నాయకత్వంలో రైతులు పలుమార్లు రాయబారం నడిపినా వారు పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో రైతులు తమ పోరాటం తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమౌతున్నారు.ఇదీ అసలు సమస్య ప్రస్తుతం ప్రభుత్వం చేసిన అలైన్‌మెంట్‌ మార్కింగ్‌ తాటిపూడి నుంచి గజపతినగరం, గుర్ల మండలాల మీదుగా సాగుతుంది. దీనికి పైన ఉన్న మెంటాడ, దత్తిరాజేరు, రామభద్రపురం, తెర్లాం, మెరకముడిదాం, బాడంగి, బలిజిపేట, బొబ్బిలి, రాజాం తదితర మండలాలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని పంపాల్సి వస్తుంది. అదే మెంటాడ, రామభద్రపురం, బొబ్బిలి, బలిజిపేట మీదుగా అలైన్‌మెంట్‌ మార్పుచేస్తే ఆండ్రజలాశయం, చంపావతి, వేగావతి, ఏడొంపులగెడ్డ, పోతులగెడ్డ తదితర నదులు, గెడ్డలను అనుసంధానం చేయవచ్చు. తద్వారా నిర్థేశిత ఆయుకట్టు పూర్తిస్థాయిలో నీరందించవచ్చు. ఆయుకట్టు ప్రాంతంలో 90శాతం భూమి దిగు భాగాన ఉండడం వల్ల లిఫ్ట్‌ల సంఖ్య, కాలువల నిర్మాణాకి ఖర్చు తగ్గుతుందని రైతులు, ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెలించాలని పట్టు సుజల స్రవంతి కాలువ కోసం ప్రస్తుత అలైన్‌మెంట్‌ ప్రకారం 8మండలాల్లో 4,400 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. కాలువల అలైన్‌మెంట్‌ మార్పు చేయడంతోపాటు ఇందుకోసం సేకరిస్తున్న భూమికి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు భూమి విలువపై నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలని ఎపి రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది.

స్వలాభం కోసం మంకుపట్టు

ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కాలువ అలైన్‌మెంట్‌ మార్పు విషయంలో ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఖర్చు తగ్గితే వారికి కమీషన్లు తగ్గిపోతాయని భావిస్తున్నారేమో. దీనివల్ల ప్రభుత్వ వ్యయం భారీగా పెరగడంతోపాటు నిర్వహణ కూడా కష్టతరంగా మారుతోంది. అలైన్‌మెంట్‌ మార్పువల్ల ఆయుకట్టు లక్ష్యానికి ఢోకాలేదని నిపుణులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిపుణుల కమిటీవేసి అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేకూర్చాలి.

బుద్ధరాజు రాంబాబు

ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

నేడు నిర్వాసిత రైతులతో సదస్సు

గంట్యాడ మండలం తాటిపూడిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూ నిర్వాసిత పోరాట కమిటీ (ఎపి రైతు సంఘం) ఆధ్వర్యాన శుక్రవారం ఉదయం 10గంటలకు సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ హాజరు కానున్నారు. స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు, కోళ్ల లలితకుమారి, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులను ఈ సదస్సుకు ఆహ్వానించినట్లు పోరాట కమిటీ కన్వీనర్‌ చల్లా జగన్‌ తెలిపారు. 58 గ్రామాల నుంచి రైతులు హాజరవుతారని తెలిపారు.

➡️