సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

Mar 26,2024 21:51

 ప్రజాశక్తి – విజయనగరం కోట : గాన కోకిల పద్మభూషణ్‌ డాక్టర్‌ పి. సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయనున్నట్లు శ్రీగురు నారాయణ కళా పీఠం అధ్యక్షులు డాక్టర్‌ జి సన్యాసమ్మ, వ్యవస్థాపక అధ్యక్షులు బిఎ నారాయణ తెలిపారు. మంగళవారం పట్టణం లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తృతీయ వార్షికోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ గురు నారాయణ కళాపీఠం తృతీయ వార్షికోత్సవం ఏప్రిల్‌ 1వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియ ంలో నిర్వహిస్తామన్నారు. విజయనగరం ఆడపడుచు గాన కోకిల పి.సుశీలమ్మ కు వయోభారమైనప్పటికీ మన విజయనగరం పై మక్కువతో ఈ పురస్కార స్వీకరణకు ఆమె అంగీకరించారన్నారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు మణిశర్మ, నాటి లవకుశలో నటించిన మాస్టర్‌ సుబ్రహ్మణ్యం 76 ఏళ్ల వయసులో ఇప్పుడు రావడానికి ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. సాయంత్రం 6 గంటలకు మణిశర్మ సారధ్యంలో సంగీత విభావరి నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో హోటల్‌ అధినేత బాబురావు, కోశాధికారి బి. పద్మావతి, గాయకులు పవన్‌, చరణ్‌, వైవివి సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️