సూళ్లూరుపేటలో బెదిరింపులు మున్సిపల్‌ కార్మికుల భారీ ర్యాలీ

Dec 30,2023 21:58
గూడూరులో భారీ ర్యాలీ

సూళ్లూరుపేటలో బెదిరింపులు మున్సిపల్‌ కార్మికుల భారీ ర్యాలీప్రజాశక్తి – గూడూరు టౌన్‌ కాంట్రాక్ట్‌ మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని నాయకులు పట్టు బిగిస్తున్నారు. గూడూరు పట్టణంలోనీ కాంటాక్ట్‌ మున్సిపల్‌ వర్కర్లు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో కాంటాక్ట్‌ మున్సిపల్‌ వర్కర్లకు హామీలు ఇచ్చి వారి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్నా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమే గాక, మోసపూరితంగా వ్యవహరించారన్నారు. ఈ ర్యాలీలో నాయకులు జోగి శివకుమార్‌, బివి రమణయ్య, సంపూర్ణమ్మ, మున్సిపల్‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.రమేష్‌, ధారా కోటేశ్వరరావు పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, ఛైర్‌పర్సన్‌ శ్రీమంతరెడ్డి కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. ప్రైవేట్‌ కార్మికులతో పని చేయించుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సరం సందర్భంగా కొంతమంది కార్మికులను కేటాయించడమో, లేదంటే ఇతర కార్మికుల దగ్గర పనిచేయించుకుంటే వాళ్లని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. యూనియన్‌ నాయకులు స్పందిస్తూ ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల ఇళ్లల్లో పనిచేస్తున్న వారిని సమ్మెలోకి రమ్మని కోరడం లేదన్నారు. అలాగే వాటర్‌, కరెంట్‌ వాళ్లు విధుల్లో వెసులుబాటు ఉన్నపుడే వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెలో సిఐటియు నాయకులు కె.సాంబశివయ్య, బి.పద్మనాభయ్య, సుంకర అల్లెయ్య, కె.లక్ష్మయ్య పాల్గొన్నారు. – నాయుడుపేటలో నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒంటి కాలుతో వినూత్న నిరసన తెలిపారు. జిల్లా నాయకులు శివకవి ముకుంద, చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందన్నారు. చర్చలు జరిపి సమ్మె విరమించేలా చూడాలన్నారు. యూనియన్‌ నాయకులు నెలవల మస్తానయ్య, శ్రీనివాసులు, నాగరాజు, లీలామోహన్‌ పాల్గొన్నారు. గూడూరులో భారీ ర్యాలీ

➡️