సృజనా స్ఫూర్తి… వైజ్ఞానిక దీప్తి

Dec 23,2023 21:33

ప్రజాశక్తి-పార్వతీపురం : వి ద్యార్థుల సృజనాత్మక స్ఫూర్తి వెల్లివిరిసింది. వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేసి, అబ్బురపరిచాయి. స్థానిక డివిఎం స్కూల్లో విద్యా శాఖ ఆధ్వర్యాన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారం నిర్వహించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అర్‌.గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాల ప్రదర్శనలు తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పాఠాలు బోధించడంతోపాటు విద్యార్థుల్లో ఇమిడి ఉన్న శాస్త్రీయత, సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తరగతి గది నుంచే వినూత్న ఆలోచనలకు బీజం వేసి బావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాలన్నారు. విద్యార్థి దశ నుంచే సృజనను ప్రోత్సహిస్తూ, సామాజిక అంశాలనే పరిశోధనలకు ఎంచుకొని కొత్త ఆలోచనలతో ప్రతిభ చూపాలని సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనల్లో అవకాశాలు కల్పిస్తే ప్రతిభ బయటకు వస్తుందన్నారు. అందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల, మండల స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాలో మండలానికి మూడు కేటగిరీల చొప్పున వైజ్ఞానిక ప్రదర్శనలు పోటీలో నిలిచాయని తెలిపారు. విద్యా వైజ్ఞానిక పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఆర్‌.తేజేశ్వరరావు, ఎన్‌.ఉమామహేశ్వరరావు, జి.తులసి వ్యవహరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోని గౌరీశ్వరి, పాలకొండ డిప్యూటీ డిఇఒ డి.గోపాలకృష్ణ, ఎంఇఒలు వై.విమలకుమారి, కె.ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయులు బి.గోవింద, జిల్లా సైన్స్‌ అధికారి జి.లక్ష్మణరావు, జిల్లా కో ఆర్డినేటర్‌ పి.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️