సొంతింటి కల సాకారమే లక్ష్యం

Mar 4,2024 21:15

ప్రజాశక్తి- బొబ్బిలి:  పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియంలో సోమవారం పట్టణ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వస్తే సొంతిల్లు లేని పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తామని పాదయాత్ర, ఎన్నికల్లో ప్రజలకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లే అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి జగనన్న ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పేదల ఇంటికి నిర్మాణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో 1741 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు చెలికాని మురళి, జి.రమాదేవి, కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి, జెసిఎస్‌ కన్వీనర్‌ రేజేటి విస్సు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.బాడంగి: అర్హత ఉన్న ప్రతి పేదవాడికీ సొంతింటి నిర్మాణ కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇంటి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. సోమవారం పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు పంపిణీ చేశారు. మండలం పరిధిలో 398 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రాజారావు, ఎంపిడిఒ ఆంజినేయులు, జెడ్‌పిటిసి రామారావు, ఎంపిపి బోగి గౌరి, నాయకులు తెంటు మధుసూదన్‌, వైస్‌ ఎంపిపి రమేష్‌ తుదితరులు పాల్గొన్నారు.భోగాపురం: ఇల్లు లేని ప్రతి పేదోడికి ఇల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఇళ్ల పట్టాలను ఆయన సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు స్థలం మంజూరు చేసి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడమనేది ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఎంతో విలువైన స్థలాలను పేదలకు అందించామన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని జాకీలు పెట్టి లేపిన టిడిపి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. ఇక్కడ జనసేన అభ్యర్థి బకెట్లు పంపిణీ చేస్తున్నారని అవి తీసుకుని వైసిపికే మళ్లీ ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉప్పాడ అనూష రెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు పడాల శ్రీనివాసరావు, భాను, తహశీల్దార్‌ పి.శ్యాంప్రసాద్‌, ఎంపిడిఒ చంద్రకళ, నాయకులు బైరెడ్డి యర్రప్పలనారాయణ, సుందర హరీష్‌, కర్రోతు వెంకటరమణ, పతివాడ రామకృష్ణ, పైడి నాయుడు, వాసుపల్లి రెయ్యుడు తదితరులు పాల్గొన్నారు.

➡️