సౌండ్‌ ఫుల్‌…నిద్ర నిల్‌!

Feb 17,2024 21:19

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని చిన్నగుడబ గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన మైనింగ్‌ వల్ల ఈ క్వారీకి సమీపానున్న గదబవలస గ్రామ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మైనింగ్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన స్టోన్‌ క్రషర్‌ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో అత్యధిక ధ్వని ప్రభావం వల్ల ప్రజలకు నిద్రలేమి కలగడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్వారీ వల్ల గ్రామమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్‌ నుంచి వచ్చే ధుమ్మూ, ధూళి వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే పంటలు కూడా పండడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలను పూడ్చాలిక్వారీ వద్ద వంద అడుగులపైబడి అడుగులోతులో ఉన్న గుంతను పూడ్చకపోతే వ్యవసాయ భూములన్నీ బీడు భూములుగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నీరంతా ఈ గుంతలో చేరి సాగు భూముల్లో తడి లేకుండా చేస్తుంది. ఈ విషయమై అధికారులు గుర్తించి గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.గ్రామాన్ని గుర్తించని అధికారులు… ఈ మైనింగ్‌ కంపెనీ చిన్న గొడవ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనివల్ల రెవెన్యూ గ్రామానికి ఎలాంటి ఇబ్బందుల్లేవని చెబుతున్నారు. పరిశీలనకు వచ్చిన అధికారులకు క్వారీకి ఆనుకొని ఉన్న గ్రామాన్ని గుర్తించకపోవడం అనేది బాధాకరమైన విషయమని గదబవలస గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.భూమి పోయే బువ్వ పోయే…ఈ మైనింగ్‌ కంపెనీ నుంచి 2 మీటర్ల దూరంలో నా పొలం ఉంది. క్వారీ ఏర్పాటైన తర్వాత ఎకరాలకు కనీసం రెండుబస్తాల ధాన్యం కూడా రాలేదు. మైనింగ్‌ కంపెనీ వంద అడుగుల పైబడి లోతు తవ్వకాలు చేపట్టడం వల్ల భూమి సారాన్ని కోల్పోయి ఈ ఏడాది గడ్డి తప్ప ధాన్యం గింజ రాల్లేదు. కురిసిన వర్షం నీరంతా క్వారీ గుంతల్లో చేరి పొలాలు బీడువారి పోతున్నాయి. దీంతో భూమిపోయి బువ్వకు కరువైపోయాం.- ధర్మారావు, గదబవలస

➡️