హామీలు అమలు చేయాల్సిందే..

Dec 25,2023 21:21
ఫొటో : సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లు
హామీలు అమలు చేయాల్సిందే..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పాదయాత్ర సమయంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె ఉధృతంగా మారుతుంది. గత ఎన్నికల్లో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 14 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. సోమవారం పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నినాదాలు చేస్తూ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటిమీద రాత లాగా మారిందని ఎద్దేవా చేశారు. 2022లో సుప్రీంకోర్టు అంగన్‌వాడీలకు గ్రాడ్యూటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. మినీ సెంటర్‌ లను మెయిన్‌ సెంటర్లుగా మార్చలేదని తెలియజేశారు. హెల్పర్ల ప్రమోషన్లకు ఎటువంటి నిబంధన రూపొందించలేదన్నారు. సెంటర్ల నిర్వహణకు అంగన్‌వాడీలే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాయన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం కోసం దశలవారీగా అనేక రకాల చేసిన ఆందోళనపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించి పోలీసులతో అవమానించిందన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కోసం ఇవాళ నిరవధిక సమ్మెకు దిగడం జరిగిందని ఆయన అంగన్‌వాడీలకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. రిటైర్డ్‌ బెనెఫిట్స్‌ రూ.5లక్షల ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న సెంటర్‌ అద్దెలు 2017 టిఎ బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలనే డిమాండ్లతో అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఆత్మకూరు సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆత్మకూరు నాగయ్య, కొండమూరి హజరత్తయ్య, అంగన్‌వాడీల హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి.రాధమ్మ, సెక్టార్‌ లీడర్లు రమణమ్మ, జమీల, విజయమ్మ, విజయలక్ష్మి, రుతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️