12 వరకు క్లెయిముల పరిష్కారం

Jan 10,2024 21:29

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిములు, అభ్యంతరాలను ఈ నెల 12వ తేదీ వరకు పరిష్కరించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది జాబితాను 22న ప్రచురిస్తామని తెలిపారు. 25న జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని కొత్తగా నమోదైన యువ ఓటర్లకు గుర్తింపు కార్డులను అన్ని మండల కేంద్రాల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 186354 ఫారాలు స్వీకరించగా, వాటిలో 179811 ఫారాలు పరిష్కరించి ఓటరు జాబితాలో చేర్చినట్లు తెలిపారు. ఫారం-6 దరఖాస్తులు 43,061 స్వీకరించగా 1093 తిరస్కరణ, 41968 నమోదు అయినట్లు వివరించారు. ఫారం-7 దరఖాస్తులు 46,067కు 2636 తిరస్కరించినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగు మిషన్లపై ప్రజలకు అవగాహన కల్పించుటకు జిల్లాలో శాశ్వత సెంటర్లు, మొబైల్‌ ప్రదర్శన వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, బిఎస్‌పి ప్రతినిధి తామరకండి వెంకటరమణ, వైసిపి ప్రతినిధులు వి.శ్రీనివాసరావు, ఎస్‌.ఉమామహేశ్వరరావు, ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతినిధి పి.రవికుమార్‌, జనసేన పార్టీ ప్రతినిధి పైల శ్రీనివాసు, ఎన్నికల సూపరింటెండెంట్‌ డి.రవికుమార్‌, తదితరులు, పాల్గొన్నారు.

➡️