ఎన్నికల బరిలో 134 మంది

Apr 29,2024 21:57

విజయనగరం లోక్‌సభ బరిలో 15 మంది

7 అసెంబ్లీ స్థానాలకు 77 మంది

అరకు పార్లమెంట్‌కు 13 మంది పోటీ

4 అసెంబ్లీ స్థానాలకు 29 మంది

విజయనగరంలో రెబల్‌ అభ్యర్థిగా గీత పోటీ

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి  : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖరారయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎన్నికల అధికారులు బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని అరకు పార్లమెంట్‌ స్థానంలో 13 మంది పోటీలో నిలిచారు. విజయనగరంలో వైసిపి నుంచి బెల్లాన చంద్రశేఖర్‌, టిడిపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను పోటీ ప్రధాన పోటీ దారులుగా ఉన్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో సిపిఎం నుంచి పాచిపెంట అప్పలనర్స, వైసిపి నుంచి గుమ్మ తనూజారాణి, బిజెపి నుంచి కొత్తపల్లి గీత మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి ప్రధానమైన టిడిపి,వైసిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు 9 పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్య్ర అభ్యర్థులు మొత్తంగా 15 మంది బరిలో నిలిచారు. వైసిపి నుంచి బెల్లాన చంద్రశేఖర్‌, టిడిపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, కాంగ్రెస్‌ నుంచి బొబ్బిలి శ్రీను ఉన్నారు. ప్రధాన పోటీ వీరి మధ్యే ఉండనుంది. బి ఎస్‌ పి తరఫున బీరుబండి ప్రకాష్‌ పోటీలో ఉన్నారు విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 77 మంది పోటీ పడుతున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానంలో 15 మంది అభ్యర్థులు, శంగవరపుకోట లో 12, నెల్లిమర్ల లో 12, గజపతినగరం లో 13, చీపురుపల్లి లో 7, రాజాం లో 10, బొబ్బిలిలో 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి ఆరుగురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారిలో మండల శ్రీనివాసరావు (విజయనగరం), కొట్యాడ రమాదేవి, వబ్బిన సతీష్‌ (శృంగవరపుకోట), కోలా వర్షిణి (నెల్లిమర్ల), గుడివాడ షణ్ముఖరావు (చీపురుపల్లి), ముగడ వెంకటరమణ (బొబ్బిలి) ఉన్నారు. అత్యధికంగా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది నిలవగా, అత్యల్పంగా చీపురుపల్లిలో ఏడుగురు, బొబ్బిలిలో 8 మంది చొప్పున బరిలో ఉన్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానానికి 15 మంది బరిలో నిలిచారు. వీరిలో 9 మంది వివిధ పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వైసిపి నుంచి కోలగట్లవీరభద్రస్వామి, టిడిపి నుంచి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కాంగ్రెస్‌ నుంచి సుంకరి సతీష్‌కుమార్‌ నిలిచారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా టిడిపి రెబల్‌ మీసాల గీత పోటీలో ఉండడంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. ఎస్‌.కోట నియోజకవర్గంలో 12 మంది బరిలో నిలవగా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు, మరో ఆరుగురు వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారి, కాంగ్రెస్‌ నుంచి డాక్టర్‌ గేదెల తిరుపతి ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో 12 మంది పోటీలో ఉండగా, ఇద్దరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. మిగతా 10 మంది వివిధ పార్టీలకు చెందిన వారు. వైసిపి నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు, జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి, కాంగ్రెస్‌ అభ్యర్థి మజ్జి నాగమణి ఉన్నారు. గజపతినగరంలో 13 మంది పోటీలో నిలవగా, వీరిలో ఏడుగురు వివిధ పార్టీలకు చెందిన వారు కాగా, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వైసిపి నుంచి బొత్స అప్పలనర్సయ్య, టిడిపి నుంచి కొండపల్లి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి డోల శ్రీనివాస్‌ ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవగా, ఒకరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థి వైసిపి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, టిడిపి నుంచి కిమిడి కళా వెంకటరావు, కాంగ్రెస్‌నుంచి జమ్ము ఆదినారాయణ ఉన్నారు. రాజాం నియోజకవర్గం బరిలో పది మంది నిలవగా, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఆరుగురు వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. వైసిపి నుంచి డాక్టర్‌ తలే రాజేష్‌, టిడిపి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌, కాంగ్రెస్‌ నుంచి కంబాల జయవర్ధన్‌ ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో 8 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా వీరిలో ఇద్దరు స్వతంత్రులు, ఆరుగురు వివిధ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు, టిడిపి నుంచి ఆర్‌విఎస్‌కె రంగారావు, కాంగ్రెస్‌ నుంచి మరిపి విద్యా సాగర్‌ బరిలో ఉన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో…

పార్వతీపురం నియోజకవర్గంలో 10 మందికి గాను ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలిన 8 మంది బరిలో నిలిచారు. వైసిపి నుంచి అలజంగి జోగారావు, బత్తిన మోహనరావు (కాంగ్రెస్‌), బోనెల విజయచంద్ర (టిడిపి) ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. కురుపాం బరిలో ఏడుగురు కురుపాం : కురుపాం నియోజకవర్గం పరిధిలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. తోయిక జగదీశ్వరి (టిడిపి), పి.పుష్పశ్రీవాణి (వైసిపి), మండంగి రమణ (సిపిఎం) ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. పాలకొండ బరిలో ఏడుగురుసీతంపేట : పాలకొండ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి బరిలో ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు. విశ్వరాయి కళావతి (వైసిపి), సవర చంటిబాబు (కాంగ్రెస్‌), నిమ్మక జయకృష్ణ (జనసేన) ప్రధానంగా పోటీ పడనున్నారు. సాలూరు బరిలో ఉపసంహరణ అనంతరం ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసిపి నుంచి డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర, టిడిపి నుంచి గుమ్మడి సంధ్యారాణి , కాంగ్రెస్‌ నుంచి మువ్వల పుష్పారావు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.

➡️