14,857 మందికి జగనన్న తోడు విడుదల

Jan 11,2024 21:21

ప్రజాశక్తి-విజయనగరం  :  జగనన్న తోడు పథకం ద్వారా ఇస్తున్న రూ.10వేలు అప్పు ద్వారా చిరు వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంచుతున్నారని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే వారికి ఈ పథకం ఎంతగానో ఆదుకుంటోందని ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డికి వివరించారు. జగనన్న తోడు పథకం కింద 8వ విడతగా జిల్లాలోని సుమారు 14,857 మంది లబ్దిదారులకు, రూ.15.71 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ముఖ్యమంత్రి గురువారం విడుదల చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న తోడు పథకం కింద 6వ విడతలో రుణం తీసుకున్న 26,320 మంది లబ్దిదారులకు రూ.54.94లక్షలను వడ్డీ కింద లబ్దిదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారంలో, కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, జిల్లాలో ఈ పథకం కింద లబ్దిదారులకు జరిగిన మేలును వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో ఏడు విడతల్లో సుమారు 1,06,696 మంది చిరువ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.10వేలు నుంచి రూ.13 వేలు మధ్య దాదాపు రూ.101.12 కోట్లు వరకు వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని తెలిపారు. ఇలా రుణాలు పొందిన 1,34,867 మంది చిరువ్యాపారులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.3.08 కోట్లను వడ్డీ కింద ఐదు విడతల్లో జమ చేశామన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, రాజాం ఇన్‌ఛార్జి డాక్టర్‌ తలే రాజేష్‌, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, మెప్మా పీడీ సుధాకరరావు, సచివాలయాల నోడల్‌ ఆఫీసర్‌ నిర్మలాదేవి, డిఆర్‌డిఎ సిబ్బంది, లబ్దదారులు పాల్గొన్నారు.

➡️