16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 10,2024 00:10

పెదనందిపాడులో మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌, సత్తెనపల్లి టౌన్‌ :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన 16న జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం కొత్త వెంకటశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామారావు మాట్లాడగా, సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్‌లో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల సమావేశం జి.బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించగా చలమయ్య మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా బిజెపి మోసం చేస్తోందని, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్‌, అటవీ సంపదలో, ఎల్‌ఐసి వంటి తదితర సంస్థలన్నిటిని ఆదాని, అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్ట చూస్తోందని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని తెలిపారు. రైతు ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినా మరొక రూపంలో వాటిని అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు పెట్టారన్నారు. విభజన చట్టం హామీలను విస్మరించడం ద్వారా రాష్ట్రానికి మరింత ద్రోహం చేసిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధింపులకు చేస్తున్నారని, అక్రమ కేసులతో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులనూ కాలరాస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నళినీకాంత్‌, మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, జె.రామారావు, సిహెచ్‌.యానాదులు, కె.వెంకటసుబ్బారావు, డి.శ్రీను, షేక్‌ సలీం, పి.భువనేశ్వరి పాల్గొన్నారు.

సత్తెనపల్లిలో మాట్లాడుతున్న గద్దె చలమయ్య
సత్తెనపల్లిలో చలమయ్య మాట్లాడుతూ ఒకవైపు అరుగాలం శ్రామి స్తున్న రైతుల అప్పులను ముక్కుపిండి వసూళ్లు చేస్తున్న మోదీ, కార్పొరేట్‌ దిగ్గజాలు ఆదాని, అంబానిలకు రూ.16 లక్షల కోట్లు అప్పులు రద్దు చేశారని అన్నారు. బిజెపి పాలనలో లక్షన్నర మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ శక్తులకు రైతుల భూములు ధారాదత్తం చేసేందుకు భూ హక్కుల చట్టం జీవో 27ను తీసుకొచ్చి అన్ని రాష్టాలలో దీన్ని అమలు చేయాలంటూ కేంద్రం హుకుం జారి చేసిందన్నారు. మరల బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య సౌధం కూలిపోతుందన్నారు. అనంతరం కౌలురైతు సంఘ నాయకులు పి.మహేష్‌ కాంగ్రెస్‌పార్టి నాయకులు ఆర్‌.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. పల్నాడు జిల్లా అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రజల్లో బిజెపి మత చిచ్చు పెడుతోందని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, సంఘాల నాయకులు జి.ఉమశ్రీ, ఎ.వీరబ్రహ్మం, ఎం.హరిపోతురాజు, శ్రీనివాస్‌, ఎం.నరసింహారావు, ఆర్‌.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో 16న జరిగే పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు వి.దుర్గారావు కోరారు. సిఐటియు, రైతు సంఘం, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దుర్గారావు మాట్లాడుతూ ఇటీవల తీసుకొచ్చిన ట్రాన్స్‌పోర్టు రంగంలోని బిల్లు లారీ యజమానులకు, ఆటో డ్రైవర్లకు ఉరితాడు లాంటిదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, పి.చిన్నారావు, కె.బాబూరావు, జె.శివశంకరరావు, ఎం.శ్రీనివాసరెడ్డి, బి.కొండారెడ్డి, టి.వెంకటయ్య, డి.సామ్యేలు, డి.వెంకటరెడ్డి, ఎం.పాములు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మంగళగిరి : గ్రామీణ బంద్‌, సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్నిసత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక వేములపల్లి శ్రీకృష్ణ భవన్లోని కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎ.ప్రభాకర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు పరాకాష్టకు చేరాయని, సంపదను సృష్టిస్తున్న కార్మికులను మోడీ ప్రభుత్వం తీవ్ర నష్టాలకు గురి చేస్తోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఎం.హనుమంతరావు, జి.దుర్గారావు, జి.జానీ, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-సత్తెనపల్లి టౌన్‌

➡️