17న జరిగే గ్రూప్‌ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15,2024 20:14

 ప్రజాశక్తి-విజయనగరం  : ఈనెల 17న జరిగే గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డి అనిత ఆదేశించారు. స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణపై ఎపిపిఎస్‌సి ప్రతినిధులు, పరీక్షా కేంద్రాల ఛీఫ్‌ సూపరింటిండెంట్లు, లైజనింగ్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు, ఆయా అధికారుల విధులు, బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ, ఆదివారం జరిగే గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 6,568 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలు వరకు జరుగుతుందని చెప్పారు. పరీక్ష ప్రారంభానికి కనీసం గంటముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం పరీక్షకు 9.45 గంటలు తరువాత, మధ్యాహ్నం 1.45 గంటలు తరువాత, పరీక్షా కేంద్రం లోపలికి అభ్యర్థులకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. హాల్‌ టిక్కెట్‌తోపాటు ఒరిజనల్‌ గుర్తింపు కార్డు (పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడి, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రభుత్వ ఉద్యోగి అయితే గుర్తింపు కార్డు)ను తీసుకురావాలని చెప్పారు. పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులను బయటకు పంపించకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్‌ విధించాలన్నారు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. అభ్యర్ధుల సందేహాల నివృత్తి చేయడానికి శుక్రవారం నుంచే కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 17 ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలు వరకు ఈ కాల్‌ సెంటర్‌ (08922236947, సెల్‌ ా 7382242251, 9848381463) పనిచేస్తుందన్నారు. సమావేశంలో ఎపిపిఎస్‌సి అసిస్టెంట్‌ సెక్రటరీ వి.బాబూరావు, ఎఎస్‌ఒ పి.సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️