20న రాస్తారోకోలను జయప్రదం చేయండి

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి

తమ సమస్యలపై అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు పిలుపుమేరకు 20న జరుగు రాస్తారోకో కార్యక్రమాలను జయప్రతం చేయాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ వైఎన్‌.భద్రం, రైతు సంఘం జిల్లా నాయకులు కొరుబిల్లి శంకర్రావు మాట్లాడారు. గత 38 రోజులుగా అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారని, వీరి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే జీతం పెంచేది లేదని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్‌ ఛార్జీలు పెంచిందని, కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచిందని, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు చేస్తున్న పోరాటం న్యాయమైందని అంగన్వాడీల పోరాటం మద్దతుగా అందరూ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

➡️