20 లక్షల ఉద్యోగాలిస్తాం: లోకేష్

Dec 10,2023 23:01 #లోకేష్
లోకేష్

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిటిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా తుని నియోజకవర్గం శృంగవక్షం విడిది కేంద్రం వద్ద సెజ్‌ రైతులతో ఆదివారం ఆయన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ హయాంలో సెజ్‌ పేరుతో తక్కువ పరిహారం ఇచ్చి భూములు తీసుకున్నారని, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని, భూమి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా లాక్కున్నారని రైతులు లోకేష్‌కు తెలిపారు. దీనిపై మాట్లాడిన లోకేష్‌ సెజ్‌లో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని, ఆ లక్ష్యం పెట్టుకొని పని చేస్తామని చెప్పారు.సెజ్‌ రైతులు న్యాయం కోసం పోరాడితే వైసిపి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ సెజ్‌లో కంపెనీలను తీసుకొచ్చి స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పరిహారం పెంచుతామని హామీ ఇచ్చి జగన్‌ మోసం చేసాడని, కంపెనీలు తరలిస్తామని తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు సెజ్‌కి గోడ కట్టి కనీసం పశువులు మేపుకోవడానికి కూడా ఒప్పుకోవడం లేదన్నారు. సెజ్‌ భూములు వైసిపి నాయకులు రియల్‌ ఎస్టేట్‌ కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. నేటికీ కొంతమంది రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, ఆక్వా రంగాన్ని, హేచరీస్‌ను జగన్‌ నాశనం చేసాడని విమర్శించారు.చంద్రబాబు హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఒక్క కియా రావడం వల్ల అనంతపురంలో ప్రజల స్థితి గతులు మారాయని, వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. కంపెనీలు, ఉపాధి ఎంత ముఖ్యమో పొల్యూషన్‌ లేని కంపెనీలు తీసుకురావడం అంతే ముఖ్యమన్నారు. పొల్యూషన్‌ లేని కంపెనీలు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గొర్రెల పెంపకం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో ఇచ్చిన మాదిరిగా అన్ని సబ్సిడీలు అందిస్తామన్నారు.లోకేష్‌ను మత్స్యకారులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. తొండంగి మండలంలో 14 మత్స్యకార గ్రామాలు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ఈ గ్రామాల్లో సుమారు 18 వేల మంది జనాభా నివసిస్తున్నామన్నారు. అరబిందో ఫార్మసి, దివీస్‌ ఫార్మా కంపెనీలు సముద్రంలోకి పైపులైన్ల ద్వారా వ్యర్థాలను వదులుతున్నాయన్నారు. దీంతో సముద్రపు నీరు విషతుల్యమై మత్స్య సంపద పూర్తిగా నశించిపోతోందన్నారు. లోకేష్‌ స్పందిస్తూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసిపి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఎద్దేవా చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి రూ.800 కోట్లు ఖర్చు చేశామన్నారు. తీరప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినపుడు మత్స్యసంపద నష్టపోకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ట్రీట్మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటుచేసి మత్స్యసంపద దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లులేని మత్స్యకారులందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పంటను తుని నియోజకవర్గం ఒంటిమామిడి వద్ద లోకేష్‌ పరిశీలించారు. పలువురు రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొండంగి గ్రామస్తులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారితో లోకేశ్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్‌ వెనుకా ఒక స్కామ్‌ దాగి ఉంటోందన్నారు. పేదలకు ఆవాసయోగ్యం కాని సెంటు పట్టాలిచ్చి రూ.7 వేల కోట్లు దోచుకున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని ప్రతిపేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

➡️