ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం పార్వతీపురం మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. తడిసిన ధాన్యం, దెబ్బతిన్న కూరగాయల పంటలను పరిశీలించారు. మండలంలోని పుత్తూరు పంచాయతీ దిబ్బగుడివలసలో రైతు పి.తిరుపతికి చెందిన కళ్లాల్లోనే తడిసిపోయిన 100 బస్తాల ధాన్యాన్ని పరిశీలించారు సంఘంవలసలో నష్టపోయిన కూరగాయల పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను కారణంగా తడిసి రంగు మారిన ధాన్యాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు, షరతులు లేకుండా మద్దతుధరకు కొనుగోలు చేయాలన్నారు. కూరగాయల రైతుకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన క్యాబేజీ సాగుచేసిన రైతులను ఉద్యాన శాఖ ద్వారా పరిశీలించి, ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, నాయకులు శంకర్రావు, శివున్నాయుడు, ఉన్నారు.పత్తి రైతులకు నష్టం రావికోన పంచాయతీలో పత్తి పండించిన రైతులు తుపాను కారణంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, సర్పంచ్‌ కె.రామస్వామి డిమాండ్‌ చేశారు. రావికోన పంచాయతీ పరిధిలో దెబ్బతిన్న పత్తి పంటను ఆయన పరిశీలించారు పత్తి పంట తడిసి రాలిపోవడంతో రైతులు మొత్తం నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.బలిజిపేట : తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతుసంఘం నాయకులు ఆవు సాంబమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. బలిజిపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపానుతో కురిసిన వర్షాల వల్ల వరి, పత్తి, అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి, రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో నాయకులు వై.కృష్ణమూర్తి, రాములు, నేలయ్య పాల్గొన్నారు.సాలూరు : మిచౌంగ్‌ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పంటకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గురువారం నెలిపర్తి గ్రామంలో మునిగిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. రైతులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చిన సమయంలో తుపాను రైతులను పూర్తిగా దెబ్బతీసిందన్నారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రంగు మారిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. బొర్రపణుకువలస, నారింజపాడు గ్రామాలలో మునిగిన వరి పొలాలను సిపిఎం మండల నాయకులు వంతల సుందరరావు, గెమ్మెల జానకిరావు పరిశీలించారు.ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన నిరసనకొమరాడ : తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన కొమరాడలో జూనియర్‌ కళాశాల సెంటర్‌ వద్ద నిరసన చేపట్టారు. పంట నష్టాన్ని వెంటనే గుర్తించి, నష్టపరిహారం ఇవ్వాలని ఎపి రైతుసంఘం జిల్లా నాయకులు ఉపేంద్ర, సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గౌరు నాయుడు, పోలినాయుడు, లక్ష్మణరావు, ఈశ్వరరావు, వెంకట్రావు, సుబ్బారావు, తవిటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.తడిసిన పంటపై పిచికారీవీరఘట్టం : వర్షాలతో తడిసిన పంటకు గురువారం రేగులపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.రత్నకుమారి పర్యవేక్షణలో ఐదు శాతం ఉప్పు ద్రావణంతో పిచికారీ చేశారు. పిచ్చికారీ చేయడం వల్ల పంట తడిసినా, ధాన్యం రంగు మారే అవకాశం ఉండదని ఎడి రత్నకుమారి తెలిపారు. కార్యక్రమంలో ఎఒ జక్కువ సౌజన్య, విఎఎ, రైతులు పాల్గొన్నారు.మక్కువ : తుపాను కారణంగా తడిసి ముద్దయిన వరి పైరుపై ఉప్పు నీరు పిచికారీ చేయాలని మార్కొండపుట్టి సచివాలయ ఉద్యాన శాఖ సహాయకులు సత్యవతి రైతులకు సూచించారు. గైశాల తదితర గ్రామాల్లో దగ్గరుండి రైతులతో వరి ధాన్యంపై ఉప్పునీటి పిచికారీ కార్యక్రమం చేపట్టారు.తుపానుతో తీవ్ర నష్టంపాచిపెంట : తుపానుతో కురిసిన వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని కొటికిపెంట సర్పంచ్‌ ఇజ్జాడ అప్పలనాయుడు తెలిపారు. మండలంలోని కొటికిపెంట, గోగాడవలస గ్రామాల్లో నీట మునిగిన వరి పంటను గురువారం ఆయన పరిశీలించారు. పంట నష్టాన్ని అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రైతులను ఆదుకుంటామని ఆయన హామీనిచ్చారు.

➡️