24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 18,2024 20:11

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిఆర్‌ఒ జి.కేశవనాయుడు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శనివారం జరిగింది. ఈ సమావేశంలో డిఆర్‌ఒ మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పార్వతీపురం డివిఎంఎం, సాలూరు, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. 659 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని, తదనుగుణంగా బస్సులు నడపాలని ఆయన చెప్పారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పరీక్షల పేపర్లు నిర్దేశిత కేంద్రాలకు పంపించుటకు తగు ఏర్పాట్లు చేయాలని పోస్టల్‌ శాఖను కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పక్కాగా ఉండాలని పోలీసు శాఖకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు 384 మందిజిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు 384 మంది హాజరు కానున్నారని డిఆర్‌ఒ తెలిపారు. పార్వతీపురం కెవిఎం పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు పార్వతీపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతాయని, 288 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన చెప్పారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో పరీక్షల సహాయ కమిషనర్‌ సుధాకర్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.వినోద్‌, ఆర్‌టిసి సహాయ మేనేజర్‌ బడి కృష్ణమూర్తి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌, పోస్టల్‌ ఇన్స్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️