బాల్య వివాహ రహిత రెవిన్యూ డివిజన్ గా కలిసికట్టుగా తీర్చిదిద్దుదాం : అపూర్వ భరత్

Jun 18,2024 16:50

ప్రజాశక్తి -పెనుకొండ : బాల్య వివాహ రహిత రెవిన్యూ డివిజన్ గా కలిసికట్టుగా తీర్చిదిద్దుదాం అని పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ భువన విజయం సమావేశం భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయిలో సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం పెనుకొండ రెవెన్యూ డివిజన్ లో బాల్య వివాహాల గురించి అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. ఏ ఒక్క గ్రామంలో కూడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు కలిసికట్టుగా సమన్వయము తో బాల్య వివాహాలను నిరోధించాలని తెలిపారు. బాల్య వివాహం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి సరైన సమయంలో వారికి కౌన్సిలింగ్ అందించి పోలీస్ అధికారుల సహకారంతో బాల్య వివాహాలను నిరోధించాలని తెలిపారు. ఈ సందర్బంగా బాల్య వివాహాల నిరోధక చట్టం పైన నియమ నిబంధనల పైన మహేష్ డిసిపిఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ, సిడిపివోలు శాంతా, రెడ్డి , గీతబాయి, బాలల పరిరక్షణ అధికారులు నాగలక్ష్మి, మురళి ,పెనుకొండ హిందూపురం, లేపాక్షి, పరిగి చిలమత్తూరు తహసీల్దార్, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఐసిపిఎస్ సిబ్బంది, శిశు గృహ సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, వీఆర్వో పంచాయతీ సెక్రటరీలు, మహిళా పోలీసులు, వార్డ్ అడ్మిన్లు,వార్డ్ వీఆర్వోలు పాల్గొన్నారు.

➡️