25వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 5,2024 20:29

 ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌   :   రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 25రోజులైంది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రూపాల్లో వినూత్నరీతుల్లో నిరసన తెలిపారు. కొమరాడలో సిఎం చిత్రపటం వద్ద భజన చేసి ర్యాలీ చేయగా, సాలూరులో ఉరితాళ్లతో గుమ్మలక్ష్మీపురం గడ్డి తింటూ, పార్వతీపురంలో మోకాళ్లపై నిల్చొని, ఇలా అన్ని చోట్లా అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు మర్రావు అలివేలు, సాలూరు గౌరీమణి నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు బొత్స లక్ష్మి, టిడిపి మాజీ నాయకులు గర్భాపు ఉదయభాను మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కార్యకర్తలు మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్‌ నాయకులు వి.శాంతి, కె.రాజేశ్వరి, ఎం.గౌరి, వి.సునీత, అధిక సంఖ్యలో వివిధ కేంద్రాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఎం చిత్రపటం వద్ద భజన చేస్తూ నిరసన

కొమరాడ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటం వద్ద భజన చేస్తూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం సిఎం చిత్రపటం తలపై పెట్టుకొని అంగన్వాడీలు రహదారిపై ర్యాలీ చేస్తున్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో కొమరాడ ప్రాజెక్ట్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సెక్టార్‌ నాయకులు బి.అలివేలుమంగ, జ్యోతి, మల్లేశ్వరమ్మ, పద్మ, జయమ్మ, లలిత, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

ఉరితాళ్లతో నిరసన

సాలూరు: అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు నిరసన శిబిరం వద్ద ఉరితాళ్లను మెడకు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చెప్పారు. గతంలో సిఎం జగన్‌ ఇచ్చిన హామీ లనే అమలు చేయాలని కోరుతుంటే ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పారు.వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల వరలక్ష్మి తిరుపతమ్మ పార్వతి శశికళ పాల్గొన్నారు.

సీతంపేట: స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 25వ రోజుకు చేరింది. సమ్మె శిబిరంలో కోతాం అంగన్వాడీ హెల్పర్‌ ఎస్‌.శిరీష వడదెబ్బకు గురైంది. పాలకులు అంగన్వాడీలను వేధించడం అనాగరిక చర్యలా వుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలుకై దృష్టి పెట్టాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడడం మహిళా ఉద్యోగులను అవమానపర్చడమే అవుతుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్‌,ఎం.కాంతారావు కార్యకర్తలు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురంలో అంగన్వాడీలు 25వ రోజు సమ్మెలో భాగంగా గడ్డి తిని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుకుంటే గడ్డి తిని బ్రతకాలా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోలక అవినాష్‌, మండంగి రమణ, పి. మోహన్‌ రావు, సన్యాసిరావు, శంకర్‌ రావు ఉన్నారు.

సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన కొనసాగింది. సమ్మెలో శ్రామిక మహిళా సంఘం నాయకులు రామలక్ష్మి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ఎం.సత్యవతి, యశోద రెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కురుపాం : అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరాడుతామని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి అన్నారు. సమ్మె శిబిరంలో వినూత్నంగా పలకలపై అంగన్వాడీల సమస్యలను రాసి, వాటిని పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు జె.సరోజ, కురుపాం, జియ్యమ్మవలస మండలాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.

పాలకొండ : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పాలకొండ ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా, కోలాటం తదితర రూపాల్లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడారు. టిడిపి పార్లమెంటరీ నాయకులు కర్నేన అప్పలనాయుడు అంగన్వాడీ శిబిరం దగ్గరకు వచ్చి మద్దతు తెలిపారు. ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు జి.జెస్సీబాయి, ప్రతినిధులు జి.శారద, ఆర్‌.భవాని, ఎం.శ్యామల, శ్రీదేవి, సుగుణ, లలిత, నిర్మల, గంగమ్మ, కుమారి తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

గరుగుబిల్లి: మండలంలో అంగన్వాడీలు సమ్మె కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ, అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకులు మర్రాపు సావిత్రి, కాత్సాయిని, కృష్ణవేణి, టి.లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️