26 వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ రిజిస్ట్రేషన్లు

Dec 22,2023 21:24

 ప్రజాశక్తి-విజయనగరం :  ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు రిజిష్ట్రేషన్లు చేసుకొనేందుకు ఈ నెల 26వరకు అవకాశం కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. క్రీడాపోటీల సన్నద్దతపై వివిధ శాఖల అధికారులు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, పిఇటిలు, ఎంపిఒలు, మండల, నియోజకవర్గ సమన్వయకర్తలతో శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, జిల్లాలో క్రీడా పోటీలకు మొత్తం 626 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇప్పటివరకు సుమారు లక్షా, 13 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. కొన్ని మండలాల్లో రిజిష్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉందని, దానిని పెంచాలని కోరారు. ఆసక్తి ఉన్నవారికి ఈనెల 26 వరకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే రిజిష్ట్రేషన్లు చేసుకున్న క్రీడాకారుల చేత శనివారం జట్లను రూపొందించాలని ఆదేశించారు. దీనికోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రతీఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకొని, రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. 24వ తేదీ నుంచి మ్యాచ్‌ షెడ్యూల్‌ను రూపొందించి, జాబితాలను ప్రదర్శించాలన్నారు. 24,25 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి క్రీడల్లో పాల్గొనేవారికి, ప్రేక్షకులకు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి, మండల స్థాయి పోటీలకు పంపించాలన్నారు. మండల స్థాయి పోటీల్లో పాల్గొనే జట్లకు టి-షర్టులు, టోపీలను ఇస్తామని చెప్పారు. ఈనెల 23వ తేదీన ప్రతీ మండలంలో ఎంపిడిఒలు, ప్రత్యేకాధికారులు సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 26 నుంచి జనవరి 9 వరకు గ్రామ స్థాయిలో, 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయని జెసి తెలిపారు.ఒక శాతం సెస్‌ ను జమ చేయాలి ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జరిగే నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లుల్లో ఒక శాతం సెస్‌ను ప్రతి నెలా నిర్మాణ మండలికి అందజేయాలని సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అన్నారు. శుక్రవారం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్‌ చట్టం 1996 పై సమీక్ష నిర్వహించారు. జెసి మాట్లాడుతూ పలు నిర్మాణ పనులు చేపట్టే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్‌ చట్టం కింద ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ భవన, ఇతర నిర్మాణాల మీద వచ్చే ఆదాయంలో ఒక శాతం సెస్‌ను మండలికి జమ చేయాలన్నారు. ఒక శాతం సెస్‌ మండలికి సక్రమంగా జమ చేస్తున్నారా లేదా నివేదికలు పంపుతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. సమావేశంలో కార్మికశాఖ ఉప కమిషనర్‌ ప్రసాదరావు, పరిశ్రమల శాఖ జిఎం పాపారావు, డిపిఒ, ఆర్‌ అండ్‌బి ఇఇలు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️