బరిలో 284 మంది

Apr 29,2024 23:34

గుంటూరులో అభ్యర్థులతో మాట్లాడుతున్న ఆర్‌ఒ
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
వచ్చేనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుంటూరు, పల్నాడు జిల్లాలో 284 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుంటూరు జిల్లాలో 162మంది, పల్నాడు జిల్లాలో 122 మంది పోటీ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రెండు పార్లమెంటు స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 311మంది నామినేషన్లను అధికారులు ఈనెల 26న ఆమోదించగా వీరిలో సోమవారం 27మంది నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ వివాదాలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 40 మంది పోటీ చేస్తుండగా ఆ తరువాత గుంటూరు లోక్‌సభకు 30మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా తాడికొండ నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులే పోటీలోఉన్నారు. గుంటూరు పార్లమెంటు స్థానానికి 34 మంది నామినేషన్లు దాఖలు చేయగా నలుగురు ఉపసంహరించుకున్నారు. 30 మంది పోటీలో ఉన్నారు. నర్సరావుపేట పార్లమెంటు స్థానానికి 19 మంది నామినేషన్లు దాఖలుచేయగా నలుగురు ఉపసంహరించుకోవడంతో 15 మంది పోటీలో ఉన్నారు. ఈనెల18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ దాదాపు 12 రోజులపాటు కొనసాగింది. మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అధికారులు నమూనా బ్యాలెట్‌ను నిర్ధారించారు. ఏ అభ్యర్థి పేరు సీరియల్‌ నంబరులో ఎక్కడ ఉందో తెలుసుకునేలా నమూనా బ్యాలెట్‌ను అభ్యర్థులకు అందచేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకు గాజు గ్లాసుగుర్తు కేటాయింపు కలకలం రేపింది. జనసేన గుర్తు నవతరం పార్టీకి దక్కడం టిడిపి నేతలకు కొంత కలవరపాటుకు గురి చేసింది. మొత్తంగా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉపసంహరణలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రచారం పూర్తి చేయడానికి కేవలం 12 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

➡️