3,4తేదీల్ల బాలోత్సవం

Dec 27,2023 21:46

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జనవరి 3,4 తేదీల్లో విజయనగరం బాలోత్సవం పేరిట ఆనంద గజపతి ఆడిటోరియంలో పిల్లల పండగ నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం కమిటీ అధ్యక్షులు జిఎస్‌ చలం, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం గురజాడ అప్పారావు నివాసంలో ఇందుకు సంబంధించిన బాలోత్సవం పిల్లల పండగ బ్రోచర్‌ను డిప్యూటీ డిఇఒ ఆర్‌.వాసుదేవరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలోత్సవం పేరిట పాఠశాలల్లో పిల్లలకు పలు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వలన పిల్లల్లో ఉన్న నిగూఢమైన శక్తులు బయటకు రావడానికి అవకాశం ఉంటుందన్నారు ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిత్వం రావాలంటే మంచి పుస్తకం చదవాలన్నారు. బాలోత్సవం అధ్యక్షులు జి.ఎస్‌.చలం మాట్లాడుతూ పిల్లల్లోని కళలు, నైపుణ్యాలను బయటకు తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు, ఆహ్వాన సంఘం చైర్మన్‌ ధవళ సర్వేశ్వరరావు, విజయనగరం ఎంఇఒ-2 పి. సత్యవతి, జక్కు రామకృష్ణ, గురజాడ వారసులు ఇందిర, భోగరాజు సూర్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️