390 కేజీల పత్తి విత్తనాలు స్వాధీనం

Jun 7,2024 21:10

ప్రజాశక్తి -కొమరాడ : ధ్రువపత్రాల్లేకుండా విత్తనాలు, పురుగు మందులు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని గుమ్మలక్ష్మీపురం ఎడిఎ మధుసూదన్‌రావు హెచ్చరించారు. మండలంలో పత్తి విత్తనాల అమ్మకాలు చేస్తున్న ప్రైవేట్‌ దుకాణాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా మండలంలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్‌, శ్రీలక్ష్మి నరసింహ ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో ఎటువంటి అనుమతుల్లేకుండా విత్తనాలు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. దుకాణాల్లో దాడులు చేసిన సమయంలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్‌ షాపులో 240 కేజీలు పత్తి విత్తనాలు, శ్రీ లక్ష్మీనరసింహ ఫెర్టిలైజర్‌ షాపులో 150 కేజీల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలు విలువ సుమారు రూ.10.70 లక్షలు వరకు ఉంటాయని అంచనా వేశారు. ఆ రెండు దుకాణాల్లో స్టాప్‌ సేల్‌ చేయడం జరిగిందని వివరించారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలకు సంబంధించిన ధ్రుపత్రాలను పూర్తిస్థాయిలో అందజేసిన తర్వాతే అక్కడ అమ్మకాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్‌ దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు అమ్మకాలు చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్‌తో పాటు సంబంధించిన ధ్రువీకరపత్రాలు ఉంటేనే అమ్మకాలు చేయాలన్నారు. ధ్రువపత్రాల్లేకుండా ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్మకాలు చేస్తే వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల అమ్మకాలు చేసిన వారు తప్పనిసరిగా ధ్రువీకర పత్రాల్లో అందుబాటులో ఉంచుకోవాలని లేకపోతే తర్వాత కేసులు పెట్టే పరిస్థితి ఉందని అన్నారు. కాబట్టి తప్పనిసరిగా రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ధ్రుపత్రాలతో అమ్మకాలు చేసుకోవాలని సూచించారు. తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి పి.శంకర రావు, మక్కువ వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️