పత్తిబోరేల మధ్య రూ.40 లక్షలు

May 8,2024 00:49

ప్రజాశక్తి – ప్రత్తిపాడు : ఖాళీ పత్తిబోరాల మధ్యలో గోతంలో చుట్టుకుని తీసుకెళ్తున్న రూ.40 లక్షలను స్పెషల్‌ స్క్వాడ్‌ బృందం మంగళవారం స్వాధీనం చేసుకుంది. ప్రత్తిపాడు ఎస్‌ఐ సోమేశ్వరరావు వివరాల ప్రకారం.. గుంటూరు డిఎస్‌ నగర్‌ ఏటుకూరు రోడ్డుకు చెందిన లారీ డ్రైవర్‌ నాగుమల్లి రమణయ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన లారీలో పత్తిబోరేలను సోమవారం లారీలో తెచ్చి ఏటూకూరు హైవే సమీపంలోని ఓ మిల్లులో అన్‌లోడ్‌ చేశారు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఖాలీ పత్తిబోరేలతో ఆత్మకూరుకు లారీనీ తీసుకెళ్తున్నారు. అయితే లారీలో డబ్బును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్‌స్క్వాడ్‌ బృందం లారీని వెంబడిచింది. నడింపాలెంలోని జాతీయ రహదారిపై హైవే చెక్‌ పోస్ట్‌ సమీపంలో లారీని నిలిపేసి అధికారి శోభారాణి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ఖాళీ గోతాల మధ్యలో డబ్బులు చుట్టిన పట్టా కనిపించింది. నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలు, ఆధారాలేమీ లేకపోవడంతో ఆదాయపన్ను శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి డ్రైవర్‌ నుండి వివరాలు సేకరించారు.
167 లీటర్ల మద్యం, నగదు సీజ్‌
ప్రజాశక్తి-గుంటూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు మంగళవారమూ కొనసాగాయి. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ.6,230 విలువైన 3.1 లీటర్ల మద్యం, ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.1,04,840 విలువైన 142.52 లీటర్ల మద్యం, తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.1,05,000 నగదు, పొన్నూరు నియోజకవర్గ పరిధిలో రూ.15,860 విలువగల 21.96 లీటర్ల మద్యం సీజ్‌ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ రూ.3 కోట్ల 19 లక్షల 49 వేల 811 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్‌ చేశారు.

➡️