44 నామినేషన్ల తిరస్కరణ

Apr 26,2024 22:03

విజయనగరం జిల్లాలో 25.. పార్వతీపురం మన్యంలో 19

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌/ పార్వతీపురం రూరల్‌  : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయ్యింది. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్‌ పత్రాలను పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో 61 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వారిలో 11 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మన్యం జిల్లాలో అరకు పార్లమెంట్‌ పరిధిలో 40 మందికి 8మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 24 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. విజయనగరం పార్లమెంట్‌ స్థానంలో 18మంది నామినేషన్లకు ముగ్గురు అభ్యర్థులు (కలిశెట్టి రామలక్ష్మి, బెల్లాన వంశీకృష్ణ, ఇప్పిలి అప్పల నాయుడు) నామినేషన్‌లు తిరస్కరించారు. 15 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని జిల్లాలో 7 అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికలకు సంబంధించి మొత్తం 105 నామినేషన్‌ లు దాఖలు కాగా ఇందులో 83 సక్రమంగా వున్నట్టు ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. రాజాంలో 12మందికి ఇద్దరు, బొబ్బిలిలో 13 మంది నామినేషన్‌లకు 4, చీపురుపల్లిలో 13మంది నామినేషన్‌లకు 5, గజపతినగరంలో 15 నామినేషన్‌లకు 2, నెల్లిమర్లలో 16 మంది నామినేషన్‌లకు 3, విజయనగరంలో 24 నామినేషన్‌లకు 4, ఎస్‌.కోటలో 16 నామినేషన్‌లకు 2 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 80 మంది నామినేషన్లు సక్రమంగా వున్నట్టు నిర్ధారించారు.

➡️