7వ రోజుకు అంగన్వాడీల సమ్మె

గుంటూరులో ఆకులు తింటూ అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడాన్ని అడ్డుకుంటామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. గుంటూరులో ఆకులు తిని నిరసన తెలపడంతోపాటు జెసికి వినతిపత్రం ఇచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో భారీ ప్రదర్శన, ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్‌డిఒకు వినతిపత్రం ఇచ్చారు.గుంటూరులో అంగన్‌వాడీల సమ్మె 7వ రోజుకు చేరుకున్న సందర్భంగా కలెక్టరేట్‌ ఎదుట కొనసాగుతున్న సమ్మె శిబిరంలో సోమవారం వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో సమ్మె శిబిరానికి తరలివచ్చారు. తొలుత అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చెట్ల ఆకులు నోట్లో పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు పగులగొట్టవద్దని కోరుతూ స్పందనలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకవైపు మంత్రులు తాళాలు పగులగొట్టాలని చెప్పలేదని ప్రకటిస్తున్నారని, మరోవైపు క్షేత్ర స్థాయిలో తాళాలు పగుల గొడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నెలల తరబడి సెంటర్లకు అద్దెలు చెల్లించకపోవటం, ఇప్పుడు తాళాలు పగులగొడుతుండటం వల్ల ఆయా భవనాలు యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, సెంటర్లు ఖాళీ చేయాలని చెబుతున్నారని అన్నారు. తక్షణమే ఈ చర్యను ఆపాలని స్పందనలో జెసి రాజకుమారిని కోరారు. తాళాలు పగులగొట్టిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.సమ్మె శిబిరానికి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నగర కార్యదర్శి టి.రాధ అధ్యక్షత వహించారు. ఆర్టీసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిప్రసాద్‌, ఎఐయుటియుసి నాయకులు సుధీర్‌, మాజీ మంత్రి డాక్టర్‌ శనక్కాయల అరుణ, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు బి.సత్యనారాయణ, ఎఐవైఎఫ్‌ జిల్లా నాయకలు వలి పాల్గొని మద్దతు తెలిపారు. సమ్మె విజయవంతమయ్యే వరకూ అండగా ఉంటామని ప్రకటించారు. అంగన్‌వాడీల సమస్యలపై ప్రజాగాయకుడు పి.వి.రమణ గేయాలు ఆలపించి సంఘీభావం తెలిపారు. మెప్మా ఆర్‌పిల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్‌పిలకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నందున తాము తీసుకోబోమని పీడీకి స్పష్టంగా తెలియజేశామన్నారు. స్కీమ్‌ వర్కర్లంతా ఐక్యంగా ఉండాలని వారు ఈ సందర్భంగా పిలుపునివ్వటం అంగన్‌వాడీల్లో స్ఫూర్తినింపింది. కార్యక్రమంలో చినవెంకాయమ్మ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు, శ్యామలా, వేదవతి, గోళ్ల మెర్సి, బాజీబి, పద్మ, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు పాల్గొన్నారు.

నరసరావుపేటలో నిరసన ప్రదర్శన చేస్తున్న అంగన్వాడీలు
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో ధర్నా చౌక్‌ నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ఆంగన్వాడీలు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఆర్‌డిఒ ఎం.శేషిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. వీరికి మద్దతుగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడం, కేంద్రాల తాళాలను పగల గొట్టించడం దారుణమని మండిపడ్డారు. లక్షల మంది అంగన్వాడీలు రోడ్డెక్కి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని విమర్శించారు. అధికారులు తాళాలు పగలగొట్టించి పిల్లలను తీసుకెళ్లి ఫొటోలు తీసిన 5 నిమిషాలకే వారిని ఇంటికి పంపుతున్నారని, ఇక వారికి ఆహారం, సంరక్షణ, చదువు తదితర బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బాలింతలు గర్భిణీలు పిల్లలు సమ్మె వద్దకు వచ్చి అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు మద్దతు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.హనుమంతరెడ్డి, ఎస్‌.ఆంజనేయ నాయక్‌ మాట్లాడుతూ తల్లి తర్వాత తల్లి అంగన్వాడి అని, కుటుంబ పోషణ కోసం తల్లులు పనులకు వెళ్తుంటే వారి పిల్లల ఆలనాపాలనను అంగన్వాడీలే చూస్తున్నారని అన్నారు. అందుకే వారికి ప్రజలు, లబ్ధిదార్లు మద్దతుగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. సమ్మె విచ్ఛిన్నం కోసమే మున్సిపల్‌, రెవెన్యూ, సచివాలయ అధికారులను ప్రభుత్వం పురిగొల్పుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడి సెంటర్లలో వంట పాత్రలు పాడైతే కొత్తవాటిని ఇవ్వడం లేదని, గ్యాస్‌, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినా మెనూ ఛార్జీలు పెంచడం లేదని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా బడ్జెట్‌ కూడా పెంచకుండా కేంద్రాల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ సమస్యలపై అంగన్వాడీలు పోరాడుతుంటే పరిష్కరించకుండా బెదిరించడం తగని పని అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, జి.మల్లీశ్వరి, నాయకులు సిలార్‌ మాసూద్‌, నిర్మల, కవిత, హెల్దా ప్లారిన్స్‌, శోభారాణి, నరసరావుపేట డివిజన్‌ పరిధిలోని ఈపూరు, వినుకొండ, నాదెండ్ల, నరసరావుపేట ప్రాజెక్టు అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️