నెల్లిమర్లలో 76.5 శాతం ఓటింగ్‌

May 13,2024 22:22

ప్రజాశక్తి – పూసపాటిరేగ, నెల్లిమర్ల, భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గంలో 248 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం 6 గంటలకే పోలింగ్‌ అధికార్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు సమక్షంలో మాక్‌పోలింగ్‌ ప్రారంభమై ఉదయం 7 గంటలకు ముగించారు. అప్పటికే పోలీంగ్‌ కేంద్రాలు వద్దకు ఓటర్లు భారీ ఎత్తను చేరుకున్నారు. 7 గంటలకు పోలింగ్‌ ప్రారంబించడంతో ప్రతి పోలింగ్‌ బూత్‌లో వందలాది మంది ఓటర్లు క్యూ కట్టారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,551 ఓటర్లుకు గానూ ఉదయం 9 గంటలు లోపు 7.51 శాతం, 11 గంటలకు 19.37 శాతం, మద్యాహ్నం 1 గంటకు 37,43 శాతం, సాయంత్రం 3 గంటలకు 50.52 శాతం, 4 గంటలకు 57.04 ఓటింగ్‌ నమోదయ్యిందని అధికార్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు73.5 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఓటర్లు వందలాదిగా పోలింగ్‌ కేంద్రాలు వద్దకు చేరుకున్నా పోలింగ్‌ సిబ్బంది ఆలస్యంగా పోలింగ్‌ పక్రియ జరపడంతో ఓటింగ్‌ శాతం మందకొండిగా నమోదైంది. ఓటర్లు ఎండవేడిమి తట్టు కోలేక వృద్దులు సొమ్మసిల్లిపోయిన సంఘటనలు కోకొ ల్లలు. పోలింగ్‌ కేంద్రాలు వద్ద పటిష్టమైన పోలీస్‌ బందో బస్ధ్‌ లేకపోవడంతో అక్కడడక్కడ తోపులాటలు జరిగాయి. పూసపాటిరేగ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద పెద్ద ఎత్తున ఓటర్ల మద్య తోపులాట జరగడంతో కొంత మంది వృద్దులు సొమ్మసిల్లారు. మహిళలు కొంత మంది ఓట్లు వేయకుండా వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న పోలింగ్‌ అధికార్లు, పోలీసులు అక్కడకు చేరుకొని లైన్లు ఏర్పాటు చేసి సమస్యను సద్గుమణిగేలా చేశారు. దీంతో ఓటర్లు మరలా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూసపాటిరేగ మండలంలోని తాళ్లపేట, భోగాపురం మండలంలోని ఎ.రాయివలసలో ఇవిఎంలు మోరాయించాయి. వెంటనే అధికార్లు స్పందించి సరిచేశారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు తన స్వగ్రామం డెంకాడ మండలంలోని మోపాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి అభ్యర్ధి లోకం మాదవి భోగాపురం మండలంలోని గాబుబానిపేటలో తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. కాంగ్రేస్‌ అభ్యర్ధి సరగడ రమేష్‌ భోగాపురం మండలంలోని చెరుకుపల్లిలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు పూసపాటిరేగ మండలంలోని రెల్లివలసలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లిమర్ల మండలంలోని తంగుడుబిల్లిలో ఓటు వేయడానికి వచ్చిన వృద్దురాలు మృతి చెందింది. చెదురు మదురు సంఘటనలు తప్పా అంతా ప్రశాంతంగా సాగింది. సోమవారం సాయంత్రం పోలిపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్‌పి దీపికా పాటిల్‌ పరిశీలించారు.

➡️