8 నుండి సమ్మెలో అంగన్వాడీలంతా పాల్గొనాలి

ప్రజాశక్తి – మాచర్ల : అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన యూనియన్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడి టీచర్లు, ఆయాలు అతి తక్కువ వేతనాలతో దశాబ్దలుగా మాతా శిశు సంరక్షణ రంగంలో పని చేస్తున్నారని చెప్పారు. వారికి సరైన న్యాయం చేయటంలో అధికార పార్టీ విఫలమైందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో మాట్లాడుతూ అంగన్‌వాడి అక్క, చెల్లమ్మలకు తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని వాగ్దానం చేశారని, ఆ హామీని ఇప్పుడు విస్మరించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేది నుండి నిరవధిక సమ్మేలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సమ్మెలో అంగన్వాడీలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు నాయకులు బండ్ల మహేష్‌, యూనియన్‌ నాయకులు ఉషా, శివకుమారి, సునీత, రుక్మణి, పద్మ పాల్గొన్నారు.

➡️