9న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

Feb 1,2024 20:35

ప్రజాశక్తి – పార్వతీపురం : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం (నేషనల్‌ డీ వార్మింగ్‌ డే), పలు ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి. జగన్నాథరావు అధ్యక్షతన ఆరోగ్య పర్యవేక్షకులకు గురువారం స్థానిక వైద్య ఆరోగ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ ఈనెల 9న డీ వార్మింగ్‌ డే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని, ఏడాది నుంచి 19ఏళ్ల వరకు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేయించి నులి పురుగులను నిర్మూలించడం ముఖ్యోద్దేశ్యమని అన్నారు. తద్వారా పిల్లల్లో రక్తహీనత నివారణ, వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల వారీగా ఉన్న మొత్తం అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలల్లోని పిల్లలు, విద్యార్థుల సంఖ్య వివరాలు, ప్రణాళిక, నివేదికలను ఆరోగ్య కార్యాలయానికి విధిగా సమర్పించాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేయాలని ఆయన స్పష్టం చేశారు.జెఎఎస్‌ ప్రోగ్రామ్‌లో కంటి వెలుగుకు సంబంధించి గుర్తించిన కేటరాక్ట్‌ సమస్యలున్న 792 మందికి ఈ నెల1 నుండి 15 వరకు శ్రీకాకుళం జెమ్స్‌ ఆసుపత్రి, విజయనగరం పుష్పగిరి, విశాఖ శంకర్‌ ఫౌండేషన్‌లో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, నిర్దేశించిన తేదీల ప్రకారం వారిని సిద్ధం చేయాలని అన్నారు. రవాణా సౌకర్యం కల్పించి ఆసుపత్రులకు చేర్చడం జరుగుతుందని వివరించారు. జెఎఎస్‌-2లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు అర్హులైన వారికి తగు నిర్దేశం చేయాలని, ఆరోగ్యశ్రీ ద్వారా అందజేసే వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య సర్వేలు చేయాలని, ఎక్కడైనా జ్వరాలు గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు జరిపి సత్వరమే చికిత్స అందజేయాలని అన్నారు. డ్రైడే కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల్లో వ్యాధి నిరోధక టీకాలు శతశాతం లక్ష్యంగా కృషి చేయాలన్నారు. గర్భిణీ, బాలింతలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందించి, హైరిస్క్‌ గర్భిణీల ఆరోగ్యాన్ని తరచుగా పర్యవేక్షణ చేసి మాతా, మరణాలు జరగకుండా కృషి చేయాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్‌బిఎస్‌కె అధికారి డాక్టర్‌ డి.భాస్కరరావు, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్‌ సుకుమార్‌ బాబు, డిఎంఒ డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, డిపిహెచ్‌ఎన్‌ఒ ఉషారాణి, ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్‌ నగేష్‌రెడ్డి, ఎఎంఒ సూర్యనారాయణ, శంకర్‌, సన్యాసిరావు, విజయ లక్ష్మి, జయగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️