9, 10 తేదీల్లో పల్నాడు జిల్లా బాలోత్సవం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి బాలోత్సవం (పిల్లల పండుగ)ను జయప్రదం చేయాలని పల్నాడు బాలోత్సవం కమిటీ అధ్యక్షులు ఆక్స్‌ఫర్డ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ డైరెక్టర్‌ రాజారెడ్డి కోరారు. ఈ మేరకు బాలోత్సవం బ్రోచర్‌ను పల్నాడు రోడ్డులోని ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌లో బాలోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతనెల 30వ తేదీతో బాలోత్సవాల ఎంట్రీల సమయం ముగిసిందని, ఇప్పటివరకు 7 వేల మంది బాల, బాలికలు వివిధ సాంస్కృతిక పోటీల్లో పాల్గొనటానికి నమోదు చేయించుకున్నారని తెలిపారు. బాలోత్స వాలకు అనూహ్య స్పందన వచ్చిందని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల నుండి విద్యార్థులు చాలా ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకు న్నారని అన్నారు. ఉత్సవాలన జయప్ర దంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. నరసరావుపేటలోని పిఎన్‌సి అండ్‌ కెఆర్‌ కళాశాల ఆవరణలో జరిగే ఈ బాలోత్సవాలు 9వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమవు తాయని, 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఒకే సమయంలో 5 వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, మరో నాలుగు వేదికలపై అకడమిక్‌ ఈవెంట్లు జరుగుతాయని వివరించారు. సుమారు 64 ఈవెంట్లలో జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీలు ముగిసిన వెంటనే ఎప్పటికప్పుడు విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాల ప్రదానం ఉంటుందని చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ భోజన వసతి ఏర్పాటు చేస్తామని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, సభ్యులు ఎం.ఎస్‌.ఆర్‌.కె ప్రసాద్‌, షేక్‌ మహమ్మద్‌ గౌస్‌, కోయ రామారావు, షేక్‌ మస్తాన్‌వలి, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి పాల్గొన్నారు.

➡️