వాడజంగిలో నేలకొరిగిన వాటర్‌ ట్యాంక్‌

Apr 5,2024 21:19

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల పంచాయతీ అయిన బీరుపాడు పంచాయతీ వాడజంగిలో గల వాటర్‌ ట్యాంక్‌ నాలుగు రోజుల క్రితం గాలికి కిందకు పడిపోయింది. దీంతో వాటర్‌ ట్యాంకు పూర్తిగా పనికిరాకుండా బద్దలైపోయింది. దీంతో చేసేదేమీ లేక గిరిజనులు గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గెడ్డ నీటిని వాడుతున్నారు. ఇదిలా ఉండగా బీరుపాడు సర్పంచ్‌ కళావతికి ఈ విషయమై గ్రామస్తులు సమాచారం అందించగా, తాను ఏమీ చేయలేనని గెడ్డ నీటినే వాడుకోవాలని సలహా అందించారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో సుమారు 60 వరకు కుటుంబాలు నివసిస్తుండగా ఒకే ఒక మంచినీటి ట్యాంకు ఉందని, ఇది కూడా గ్రామంలో వీచిన గాలికి కింద పడిపోయి బద్దలైపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. తమకు ఎలాగైనా మంచినీటి ట్యాంక్‌ను మంజూరు చేసి గ్రామస్తులకు తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఎంపిడిఒ జగదీష్‌ కుమార్‌కు సమాచారం ఇవ్వగా తక్షణమే ఆర్డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులకు పంపించి మంచినీటి ట్యాంకును మరమ్మతులు చేయించి గ్రామస్తులకు తాగునీరందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

➡️