రైతు కష్టానికి నాటిక పట్టం

Apr 10,2024 23:59

ప్రజాశక్తి – యడ్లపాడు : కొండవీటి కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య బుధవారం రాత్రి ముగిశాయి. మండల కేంద్రమైన యడ్లపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణంలో చివరి రోజు మూడు నాటికలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాపరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు మాట్లాడుతూ సమాజంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యనూ ముందే కళల ద్వారా చూపించి వాటికి పరిష్కారం చెప్పే దివిటీలు నాటికలని అన్నారు. తొలుత పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి రైతు, కౌలు రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, వై.రాధాకృష్ణ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, మండల కన్వీనర్‌ టి.కోటేశ్వరరావు, న్యాయవాది వైవీ రమేష్‌బాబు, డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు, ఎం.పద్మారావు, జె.శంకరరావు, ఎన్‌.కాళిదాసు, ఎం.రామారావు, ప్రముఖ రచయిత, దర్శకులు కందిమళ్ల సాంబశివరావు, సినీ, నాటక నటులు వైఎస్‌.కృష్ణేశ్వరరావు, జె.రామారావు, కె.శ్రీహరిరావు, టి.సాంభవివరావు, సిహెచ్‌.సృజన, ఎ.పెద్దబ్బయ్య, ఎన్‌.విజయలక్ష్మి పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన నాటిక ప్రదర్శనల్లో భాగంగా తొలిగా శిల్ప ఆకురాతి రచించిన ‘క్షేత్రం’ నాటికను జివి మనోహర్‌ దర్శకత్వంలో ఆరాధన అకాడమి గుంటూరు కళాకారులు ప్రదర్శించారు. రైతులు తమ క్షేత్రాల్లో పంటలు పండించకుంటే మానవ జాతికి తిండి ఉండదు. స్త్రీలు కడుపు పంట పండించకపోతే మానవులే ఉండరు.. మేధావులు, మహానుభావులు పట్టింది ఆ క్షేత్రం నుండే. అటువంటి క్షేత్రాలను కాపాడుకుందాం.. ఆడపిల్లలను బతకనిద్దాం.. బతికించుకుందాం.. అనే సందేశంతో సాగిన నాటిక పలు సందర్భాల్లో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
రెండో ప్రదర్శనగా చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించిన ‘విముక్తి’ నాటికను ఉషోదయ కళానికేతన్‌ కట్రపాడు కళాకారులు ప్రదర్శించారు. సమాజాన్ని ముందుండి నడిపించాల్సిన యువత గంజాయి, హెరాయిన్‌ తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారుతున్నారు. మాదకద్రవ్యాల నుండి యువతకు విమక్తి కలిగిద్దాం.. దేశాన్ని రక్షించుకుందాం.. అనే సందేశంతో ముగిసిన నాటిక ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తించింది.
చివరి ప్రదర్శనగా కంచర్ల సూర్యన్రపకాశరావు రచించిన ‘రైతేరాజు’ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో కళాంజలి హైదరాబాద్‌ కళాకారులు ప్రదర్శించారు. దేశం వెలుపల జావాను, దేశం లోపల కిసాను లేకపోతే జనం సుఖంగా బతకటం కష్టం.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పిడికెడంత సెల్‌ఫోన్‌తో ప్రపంచాన్నే శాసిస్తున్నారు. సెల్‌ఫోన్‌ లేకపోయినా బతకొచ్చు కానీ రైతు పండించే పిడికెడంత అన్నం తినకుండా ఎవరూ బతకలేరు. జనానికి అన్నం పెట్టే, దేశానికి వెన్నెముకైన రైతులు ఈ రోజు దేశమంతటా రోడ్డునపడ్డారు. వారి కష్టాలు ఎవరికీ కనిపించడం లేదు. వాళ్ల ఘోష ఎవరికీ వినిపించడం లేదు. గుండు సూది నుండి విమానం వరకు తయారు ప్రతి వస్తువునూ తయారు చేసేవాడు ఆ వస్తువులకు రేటు నిర్ణయించుకుంటాడు. కానీ ఆరుగాలం ఎండనకా, వాననకా మట్టిలో శ్రమించి పంట పండించే రైతు తన పంటకు తనే ధర నిర్ణయించుకునే హక్కు లేదు. రైతుకు కల్తీ విత్తనాలు ఇచ్చేవాడు శత్రువు, కల్తీ మందులు అమ్మేవాడు శత్రువు, మధ్య దళారులు శత్రువు. అసలు ప్రకృతే రైతుకు పెద్ద శత్రువు. ఇంతమంది శత్రువుల మధ్య బతకలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజలకు తిండి పెట్టాలని శ్రమిస్తున్న రైతుల్ని పట్టించుకోపోతే రైతులు మరోకోణంలో ఆలోచించి తమకు సరిపడా పంటను పండించుకుని పంటలు పండించడం ఆపేస్తే మిగతా జనం ఏం తిని బతుకుతారు.. అని ప్రశ్నిస్తూ, పాలకుల బాధ్యతలను గుర్తు చేస్తూ సాగిన నాటిక రైతుల కష్టాలను కళ్లకు కట్టింది. ప్రదర్శనల అనంతరం వివిధ విభాగాల్లో విజేతలకు, కళాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.

➡️