20 ఏళ్ల తర్వాత ఎండిన చెరువు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : పెద్దదోర్నాల మండలం గంటావానిపల్లి చెరువు 20 ఏళ్ల తర్వాత పూర్తిగా ఎండిపోయింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ చెరువు వెలిగొండ ప్రాజెక్టు ఊట నీరుతో కళకళలాడుతుండేది. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు పిల్ల కాలువలన్నింటిని మొయిన్‌ కాలువలో కలిపారు. దీంతో చెరువుకు వచ్చే ఊట నీరంతా ఆగిపోయింది. ఫలితంగా చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఈ చెరువులో నీళ్లుంటే గంటావానిపల్లి, కొత్తూరు, యడవల్లి గ్రామాల్లోని సాగు, తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. చెరువు కింద 700 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఆ భూముల్లో పత్తి, మిర్చి పంటలు సస్యసామలంగా పండేవి. చెరువు ఎండిపోవడంతో మూడు గ్రామాల పరిధిలోని బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది. పొలాలకు వెళ్లిన పశువులు తాగేందుకు నీళ్లు లేవు. దీంతో పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటావానిపల్లి చెరువు వల్ల 20 ఏళ్ల నుంచి ఎంతో లబ్ధి పొందామని కొత్తూరుకు చెందిన రైతు కృష్ణారెడ్డి తెలిపారు. కనీసం పశువులకు నీళ్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. చెరువు ఎండిన కారణంగా భూగర్భ జలమట్టం పడిపోవడంతో పాటు ఆయకట్టు భూములు కూడా సాగుకు నోచలేదని గంటావారిపల్లి రైతు పుల్లయ్య తెలిపారు.

➡️