30 ఏళ్ల తర్వాత కురుపాంలో చోటు

Jun 7,2024 21:03

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: సరిగ్గా 30 ఏళ్ల తర్వాత తోయక జగదీశ్వరి గెలుపుతో కురుపాం నియోజకవర్గంలో టిడిపికి చోటు దక్కింది. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన తొలి మహిళా ఎమ్మెల్యే జగదీశ్వరే. 40 ఏళ్ల రాజుల పాలనకు స్వస్తి పలుకుతూ చిన మేరంగి కోటకు బీటలయ్యే విధంగా 2024 ఎన్నికల్లో జగదీశ్వరి ఎవరూ ఊహించిన విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది కురుపాం నియోజకవర్గం చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించింది. మారుమూల ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ నుంచి తొలి మహిళా ఎమ్మెల్యే గెలుపొందడం విశేషం. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన జగదీశ్వరి ఎల్విన్‌పేట ఎంపిటిసి గా పని చేస్తూ 2024 ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు, ఓటములు చూసుకుంటే ఇలా ఉన్నాయి. అప్పటి నాగూరు, ఇప్పటి కురుపాం నియోజకవర్గంలో ఎక్కువసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. 1983లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఎస్‌ అభ్యర్థి పి.సోమందొరపై 623 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 1985లో శత్రు చర్ల విజయరామరాజు టిడిపి అభ్యర్థి వెంపటాపు భారతిపై 3941 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు కురుపాం కోటకు చెందిన ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి వైరిచర్ల ప్రదీప్‌ కుమార్‌దేవ్‌పై 3435 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 1994లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయరాజు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజుపై 32,271 ఓట్లతో మొదటిసారిగా ఘనవిజయం సాధించారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు టిడిపి అభ్యర్థి నిమ్మక జయరాజుపై 6917 ఓట్లతో విజయం సాధించారు. 2004లో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కోలక లక్ష్మణమూర్తి ప్రత్యర్థి అయిన టిడిపి అభ్యర్థి నిమ్మక జయరాజుపై 9701 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ విటి జనార్ధన థాట్రాజ్‌ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయరాజుపై 15053మెజార్టీతో గెలుపొందారు. 2014 వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి టిడిపి అభ్యర్థి జనార్ధన థాట్రాజ్‌పై పోటీ చేసి తొలిసారిగా 19083 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2019 వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి రెండోసారి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జనార్ధన థాట్రాజ్‌ పై పోటీ చేసి 26602 మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి మూడోసారి పోటీ చేసి ప్రత్యర్థి అయిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరీ పోటీ చేసి ఓటమి చెందారు. 1994, 2024 లో గిరిజన అభ్యర్థులు టిడిపి నుంచి రెండుసార్లు విజయం సాధించగా, 2004లో సిపిఎం గిరిజన అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు.

➡️