రంగస్థల కళలకు పూర్వవైభవం కోసం ‘వేదిక’

Apr 12,2024 23:55

ప్రజాశక్తి – యడ్లపాడు : ‘వేదిక’ తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనం ద్వారా ఏడు కళాపరిషత్‌లు ఒకేమాట.. ఒకేబాటగా కొనసాగుతాయని సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు చెప్పారు. రంగస్థల కళలకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ఏర్పడిన వేదిక సభ్యుల్ని ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితల్ని ప్రొత్సహించడం, కొత్త దర్శకు లను అందించడం, నూతన కళాకారుల్ని తయారు చేయడం, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే రచనల్ని ప్రేక్షకులకు చేరువచేసి రంగస్థలానికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు వేదిక కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 7 కళాపరిషత్‌ల కలయితో అణగారుతున్న నాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు సమైక్యంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కొండవీటి కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ పరిషత్‌, ఎన్టీఆర్‌ కళాపరిషత్‌, కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్‌, శ్రీకారం రోటరీ కళాపరిషత్‌, లలిత కళానికేతన్‌, శ్రీకళానికేతన్‌ సమిష్టగా పోటీల నిర్వహణకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు, డిప్యూటీ చైర్మన్‌ చిట్టినేని సాయిబాబు, ప్రధాన కార్యదర్శి జేవీ మోహన్‌రావు, కార్యదర్శి కట్టా శ్రీహరిరావు, కోశాధికారి జి.పాండు రంగారావు, సంయుక్త కార్యదర్శి పోపూరి నాగేశ్వరరావులను వేదిక చైర్మన్‌ డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు సత్కరించారు.

➡️